9 July, 2026 | 1:00 AM

మణిపూర్‌లో మళ్లీ హింస

09-07-2026 12:00 AM

మణిపూర్‌లో మూడేళ్ల క్రితం రాజుకున్న అగ్గి ఇంకా చల్లారడం లేదు. ఈశాన్య రాష్ట్రంలోని రెండు ప్రధాన తెగల మధ్య ప్రారంభమైన ఘర్షణలు నేడు అనేక వర్గాలకు విస్తరించి, చివరికి మణిపూర్‌ను దహించి వేస్తుండటం అత్యంత విషాదకరం. ఈ మూడేళ్లలో వందల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా, వేల మంది నిరాశ్రయులైన విషయం తెలిసిందే. ఇటీవల ఉఖ్రూల్ జిల్లాలో మిలిటెంట్ల దాడిలో ఇద్దరు జవాన్లు మరణించడం అక్కడి పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది.

సుదీర్ఘ కాలం పాటు అల్లర్లు కొనసాగుతుండటం, ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తుండడాన్ని ఒక రాష్ట్ర శాంతిభద్రతల సమస్యగానే చూడటం సరికాదు. ఇది ముమ్మాటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యానికి నిదర్శనం. కాగా, భారీగా బలగాలను మోహరిస్తున్నామని, మిలిటెంట్ల నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకుంటున్నామని పాలకులు ప్రకటిస్తున్నా పరిసి తిలో మార్పు రావడం లేదు. మారింది పాలకులు మాత్రమే, పరిపాలనా వ్యవస్థ కాదనే కఠోర సత్యాన్ని ఇది నొక్కిచెప్తున్నది.

నానాటికీ ఈశాన్య రాష్ట్రం రావణకాష్టంలా మండుతూనే ఉన్నది. అయినప్పటికీ ఈ అంశం జాతీయ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారకపోవడం మరింత ఆందోళనకరం. కేంద్ర, రాష్ట్ర పాలకులు ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించకపోవడం అత్యంత బాధాకరం. హింస మొదలైన వెంటనే చర్చలు జరిపి, అన్ని వర్గాల మధ్య విశ్వాసాన్ని పెంచి ఉంటే పరిస్థితి ఇంత దారుణంగా మారేది కాదు. వాస్తవానికి ఈ సమస్యను శాంతిభద్రతల కోణంలో మాత్రమే చూడడం ఇక్కడ ప్రధాన సమస్యగా మారింది.

సమస్య మూలాల వరకు వెళ్లకపోవడంతో మంటలు చల్లారినట్టు పైకి కనిపిస్తున్నా, మళ్లీ ఏదో ఒక కొత్త రూపంలో నిప్పు రాజుకుంటున్నది. తెగల మధ్య విభేదాలను కొం దరు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడంతో మణిపూర్ విభజిత సమాజంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రానికి ఇప్పుడు కావాల్సింది భద్రతా బలగాలు మాత్రమే కాదు, తెగల మధ్య విశ్వాసాన్ని నింపడం కూడా.

నిరంతర చర్చలు, అన్ని తెగల ప్రజలకు రక్షణ కల్పించడం, నిష్పాక్షికంగా విచారణ జరిపించడం లాంటి చర్యలతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపాల్సిన అవసరం ఉన్నది. మణిపూర్ రాష్ట్రంలో శాశ్వత శాంతి స్థాపనకు ఇప్పుడు రాజకీయ సంకల్పం అత్యంత ఆవశ్యకమని చెప్పక తప్పదు. లేకపోతే మణిపూర్‌తోపాటు దేశమూ మూల్యం చెల్లించాల్సి వస్తుంది.