18 July, 2026 | 8:47 AM

బెట్టింగ్ యాప్‌లపై నియంత్రణ ఏది?

02-08-2025 02:21 AM
  1. కౌంటర్ అఫిడవిట్ దాఖలుపై నిర్లక్ష్యం ఎందుకు 
  2. కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం
  3. కేఏ పాల్ పిటిషన్‌పై విచారణ

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 1 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా యువతను పెడ దోవ పట్టిస్తున్న ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల నియంత్రణ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక జారీ చేసింది.

గత విచారణలో నోటీసులు జారీ చేసినప్పటికీ ఇంత వరకు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ వైఖరి తెలుసుకునేందుకు మరో అవకాశం ఇస్తున్నామని, వాటి నియంత్రణకు ఎలాంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తారో స్పష్టం చేయాలని పేర్కొంది. తదుపరి విచారణలోగా స్పందించకుంటే నేరుగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. 

సెలబ్రిటీల ప్రచారాలపై నిషేధం విధించండి: కేఏ పాల్

విచారణ సందర్భంగా పిటిషనర్ కేఏ పాల్ తన వాదనలు వినిపించారు. బెట్టింగ్ యాప్‌ల వ్యసనానికి బానిసలై యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్న సినిమా హీరోలు, క్రీడాకారులు, సెలబ్రిటీలను నిలువరించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ కేసులో కేంద్రంతో పాటు అన్ని రాష్ర్ట ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.