10-05-2025 12:26:46 AM
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో చాలా మంది సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న కూడా ఈ అంశంపై ఓ పోస్ట్‌ను షేర్ చేసింది.
‘ఆపరేషన్ సిందూర్’ ప్రతిచర్యను విమర్శిస్తున్న వారిని ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. ఉగ్రవాదం నుంచి మనల్ని రక్షించుకునేందుకు చేస్తున్న పోరా టం యుద్ధం కాదని రష్మిక పేర్కొంది. ఈ పోరాటానికి మద్దతిచ్చే వారిని యుద్ధాన్ని కోరుకునేవారు అని చెప్పొద్దుని కోరింది. వాళ్లు దేశభద్రత, న్యాయం కోసం ఆరాటపడే పౌరులు అని తెలిపింది.
దూకుడుగా దాడి చేయడానికి, ఆత్మరక్షణకు మధ్య చాలా భేదం ఉంటుందని పేర్కొంది. ‘ఉగ్రవాదులు చేసిన కుట్రకు అమాయకులు బలయ్యారు.. దానికి ప్రతీకారం తీర్చుకోవడమనేది బాధ్యతే అవుతుంది తప్ప.. అవకాశం కాదు. శాంతిని కోరుకోవడమంటే అర్థం.. జరిగిన ప్రాణనష్టాన్ని మౌనంగా ఒప్పుకోవడం కాదు. మనకు జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకుంటున్న దేశాన్ని ప్రశ్నించొద్దు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారిని గట్టిగా ప్రశ్నించండి’ అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.