01-09-2025 02:24:18 AM
రెండేళ్లుగా సుమారు రూ.120 కోట్లు పెండింగ్
-బిల్లులు సకాలంలో రాకపోవడంతో అప్పులపాలవుతున్న వైనం
-రాష్ట్రవ్యాప్తంగా 120 మంది కాంట్రాక్టర్లపై వడ్డీల భారం
-ఈ సారి టెండర్లకు దూరంగా కాంట్రాక్టర్లు!
-చేపల పెంపకం చెరువుల లీజు కూడా చెల్లించే పరిస్థితి లేదని గగ్గోలు
-ఇప్పటికైనా పెండింగ్ బిల్లులు చెల్లించాలని విజ్ఞప్తి
హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి): తెలంగాణ వ్యాప్తంగా భారీ కురుస్తున్న నేపథ్యంలో కుంటల నుంచి మొదలుకొని పెద్ద రిజర్వాయర్ల వరకు అన్నీ నిండుకుండల్లా మారాయి. ఈ ఏడాది చేపపిల్లల పెంపకం జోరుగా సాగుతుందని అనుకుంటున్న తరుణంలో చేప పిల్లలను సరఫరా చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. దీనికి కారణం లేకపోలేదు. గత రెండు సంవత్సరాలుగా ఉచిత చేపపిల్లలను సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదు.
దీంతో అప్పులపాలైన కాంట్రాక్టర్ల జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. వాస్తవానికి బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు కాస్త వెనుకా ముందు చేప పిల్ల ల బిల్లులు అందేవని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. కానీ 2023, డిసెంబర్‌లో ప్రభుత్వం మారడంతో 2023 సంవత్సరానికి సం బంధించిన సుమారు రూ.80 కోట్లకుపైగా బిల్లులు పెండింగ్‌లో పడ్డాయి. దీనికి తోడు 2024 సంవత్సరానికి సంబంధించిన రూ.34 కోట్లను ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో కాంట్రాక్టర్లు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు.
ఈ ఏడాది టెండర్లకు దూరంగా ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం 2016లో ప్రారంభమైంది. రాష్ట్రంలోని మత్స్యకారులకు భరోసా కల్పించే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. అప్పటినుంచి ఏటా వానాకాలం సీజన్‌లో జూలై నుంచి సెప్టెంబర్ మధ్య రాష్ర్టవ్యాప్తంగా జలాశయాల్లో చేపపిల్లలను వదిలేవారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గత సంవత్సరం సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు చేప పిల్లలను వదలడంతో అవి ఆశించిన స్థాయిలో పెరగక మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయినట్టు వాదనలు ఉన్నాయి.
రాష్ర్టంలో 29,434 చెరువులు, కుంటలు ఉన్నాయి. వాటిలో దాదాపు 100 కోట్ల చేపపిల్లలు, రొయ్య పిల్లలను వదలాల్సి ఉన్నది. కానీ రెండేండ్లుగా చేపపిల్లలను సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు మత్స్యశాఖ దాదాపు రూ.120 కోట్ల పెండింగ్ బిల్లులను చెల్లించాల్సి ఉన్నది. దీంతో మత్స్యకారులకు ప్రభుత్వం ఏ స్థాయిలో భరోసా ఇస్తుందో తెలియదు, కానీ ఈ పథకం ద్వారా ప్రస్తుతం చేప పిల్లలను సరఫరా చేసిన కాంట్రాక్టర్లు మాత్రం తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బకాయిలు చెల్లించనందున ఈ సారి టెండర్లలో పాల్గొనేందుకు కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడంలేదని తెలుస్తున్నది.
32 జిల్లాల్లో 120 మంది కాంట్రాక్టర్లు
చేప పిల్లల పంపిణీ పెండింగ్ బిల్లుల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 120 మంది కాంట్రా క్టర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి 2023 సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని 32 జిల్లాలకు అవసరానికి అనుగుణంగా కాంట్రాక్టర్లు 90 కోట్లకు పైగా చేప పిల్లలను సరఫరా చేశారు. వీటి విలువ రూ. 80 కోట్లకు పైగానే ఉంటుంది. అయితే 2023 ఏడాదికి సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ 2024 ఏడాదికి కూడా కాంట్రాక్టర్లు చేప పిల్లలను సరఫరా చేశారు. కానీ దీనికి సంబంధించి కూడా రూ.34 కోట్ల బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి.
దీంతో కాంట్రాక్టర్లు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. వరుసగా రెండు సంవత్సరాలు బిల్లులు మంజూరు కాకపోవడంతో కాంట్రాక్టర్ల పరిస్థితి దారుణంగా మారింది. దీనికి తోడు 2025 సంవత్సరం కోసం ఉచిత చేపపిల్లల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 18 నుంచి 30 వరకు టెండర్లు స్వీకరించనున్నట్టు మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఈ ఏడాది ఆరున్నర లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు వెల్లడించారు.
కానీ చేపపిల్లల సరఫరా కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన రూ.120 కోట్ల బకాయిలపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో కాంట్రాక్టర్లు, మ త్స్యకారులు మండిపడుతున్నారు. బకాయిలపై స్పష్టత ఇచ్చిన తర్వాతే కొత్త షెడ్యూల్‌పై ముందుకు వెళ్లాలని తేల్చిచెప్పారు. పెండింగ్ బిల్లులను విడుదల చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు. ఇటీవల మాసబ్‌ట్యాంకులోని మ త్స్యభవన్ వద్ద అర్ధనగ్న ప్రదర్శన కూడా ని ర్వహించారు. తమకు వెంటనే బిల్లులు చె ల్లించాలని డిమాండ్ చేశారు.
వడ్డీల భారం పెరిగిపోతుంది
రాష్ట్ర ప్రభుత్వం చేప పిల్లల సరఫరాకు సంబంధించిన బిల్లులను సకాలంలో చెల్లించకపోవడంతో అప్పుల పాలవుతున్నాం. చేప పిల్లల పెంపకం కోసం చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. వీటితోపాటు చేపల చెరువుల లీజులు చెల్లించే పరిస్థితి లేదు. దీంతో కాంట్రాక్టర్లపై చాలా ఒత్తిడి పెరిగి అగమ్యగోచరంగా మారుతుంది. చాలా మంది 4 లేదా 5 రూపాయల వడ్డీకి అప్పు తీసుకొచ్చి చేప పిల్లలను పెంచారు. ప్రభుత్వానికి సరఫరా చేసిన తర్వాత బిల్లులు మంజూరు కాకపోవడంతో కాంట్రాక్టర్ల పరిస్థితి దారుణంగా ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి.
చేప పిల్లల సరఫరా కాంట్రాక్టరు, నిజామాబాద్