01-09-2025 02:24:47 AM
హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి): కాంగ్రెస్ మంత్రివర్గంలో బీసీల సంఖ్య, ఆర్టీఐ కమిషనర్ల నియామకంలో, హైకోర్టు కొలిజియంలో బీసీల వాటా ఎంత అని, బీసీల్లో అసలు సమర్థులు లేరా, కాంగ్రెస్ ప్రభుత్వం గుండెపై చేయివేసుకొని చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. చట్టసభలకు బీసీలు రావొద్దా అని నిలదీశారు.
రాష్ర్ట ప్రభుత్వం ఏవైనా చట్టాలు చేసే ముందు న్యాయస్థానాల వైపు కూడా చూడాలని, ఎలాంటి ఇబ్బందులు వచ్చే పరిస్థితి లేకుండా చట్టాలు రూపొందించాలని సూచించారు. పురపాలక చట్ట సవరణ బిల్లు (బీసీ రిజర్వేషన్ల బిల్లు)పై ఆదివారం శాసనసభలో జరిగిన చర్చపై ఆయన మాట్లాడారు. సభలో పెట్టిన 42 శాతం రిజర్వేషన్లు బీసీ బిల్లుకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇచ్చిందని చెప్పారు.
ఎక్కడా ఆటంకాలు కలగకుండా బీసీలకు లబ్ధి కలగాలని, షెడ్యూల్ 9లో జోడించిన అంశంపైనా సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వద్దని మేమెక్కడా చెప్పలేదని ఆయన తెలిపారు.
రాష్ర్టంలో బీసీలకు ఉన్న అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు సంవత్సరానికి 20 వేల కోట్ల చొప్పున 40 వేల కోట్లు కేటాయించారా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 22 నెలలైందని, ఇప్పటి వరకు బీసీలకు ఏం చేయలేదన్నారు. కాంగ్రెస్ చెపేదొకటి.. చేసేది మరొకటని పాయల్ శంకర్ విమర్శించారు.