01-09-2025 02:23:09 AM
ఇక ప్రత్యర్థులుగా కాదు.. భాగస్వాములుగా ఉందాం
2026 బ్రిక్స్ సమావేశానికి భారత్‌కు రావాలి
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీలో ప్రధాని మోదీ
సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం కొనసాగాలని నిర్ణయం
ట్రంప్ సుంకాల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యం
ఎస్‌సీవో సదస్సు వేదికగా మోదీ సమావేశం
టియాంజిన్, ఆగస్టు 31: ఇకమీదట చైనా, భారత్ ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా ఉండాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ప్రతిపాదించగా.. ఇరు దేశాల నడుమ ప్రస్తుతం శాంతి, స్థిరత్వ వాతావరణం ఉందని భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. చైనాలో జరుగుతున్న 25వ షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) శిఖరాగ్ర సదస్సు సందర్భంగా భారత ప్రధాని.. చైనా అధ్యక్షుడితో ఆదివారంసమావేశం అయ్యారు.
జిన్‌పింగ్‌తో జరిగిన చర్చల సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘గతేడాది కజన్‌లో మేమిద్దరం అర్థవంతమైన చర్చలు జరిపాం. మా సంబంధాలు సానుకూల దిశగా సాగాయి. సరిహద్దుల్లో బలగాలు వెనక్కు వెళ్లిన తర్వాత శాంతి, స్థిరత్వ వాతావరణం ఏర్పడింది. కైలాష్ మానససరోవర్ యాత్ర పునఃప్రారంభం అయింది. రెండు దేశాల మధ్య ప్రత్యక్ష విమానాలు కూడా తిరిగి ప్రారంభం అవుతున్నాయి. ఇరు దేశాల మధ్య సహకారంతో 2.8 బిలియన్ల మంది ప్రజల ప్రయోజనాలు ఆధారపడి ఉన్నాయి. ఇది మొత్తం మానవాళికి చాలా అవసరం. పరస్పరం విశ్వాసం, గౌరవంతో మా సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నాం.
ఎస్‌సీవోకు అధ్యక్షత వహించినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు’ అన్నారు. జిన్‌పింగ్ మాట్లాడుతూ.. ‘భారత ప్రధాని మోదీని కలవడం చాలా సంతోషంగా ఉంది. ఎస్‌సీవో సమావేశానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. గతేడాది కజన్‌లో మా మధ్య విజయవంతమైన సమావేశం జరిగింది. ప్రపంచం మార్పు దిశగా కదులుతోంది. చైనా, భారత్ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన రెండు నాగరికతలు.
ఈ రెండూ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాలు, డ్రాగన్, ఏనుగు స్నేహితులుగా ఉండడం ఎంతో అవసరం. చైనా మధ్య ద్వైపాక్షిక సమావేశాలు ప్రారంభం అయి ఈ సంవత్సరంతో 75 సంవత్సరాలు పూర్తవుతాయి. బహుళ ధృవ ప్రపంచంలో శాంతిని నెలకొల్పేందుకు రెండు దేశాలు చారిత్రక బాధ్యతలు నిర్వర్తించాలి’ అని పేర్కొన్నారు. 2026లో భారత్ వేదికగా జరిగే బ్రిక్స్ సమావేశానికి హాజరుకావాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను మోదీ ఆహ్వానించారు.
2026 బ్రిక్స్ సమావేశానికి రండి..
2026లో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు భారత్ వేదికగా జరగనుంది. ఈ సమావేశానికి రావాల్సిందిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను ఆహ్వానించారు. ఎస్‌సీవో శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ.. మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు, నేపాల్ ప్రధాని కేపీ శర్మీ ఓలితో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి వివిధ దేశాలకు చెందిన 20 మంది నేతలు హాజరయ్యారు. ప్రస్తుతం ఎస్‌సీవోలో 10 సభ్య దేశాలు ఉన్నాయి. భారత్ సంబంధాలు ఎంతో లోతైనవి అని మోదీ పేర్కొన్నారు. మాల్దీవులతో భారత అభివృద్ధి సహకారం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని మోదీ పేర్కొన్నారు.