calender_icon.png 12 November, 2025 | 2:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోశాలలు ఎక్కడ?

12-11-2025 12:47:57 AM

సమన్వయలోపం వల్ల స్థల సేకరణ వద్దే ఆగిన ప్రతిపాదనలు

టెండర్ల దశలోనే ఎన్కేపల్లి గోశాల

హైదరాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి) : గోమాతను దేవతగా కొలవడం భారతదేశ సంస్కృతి. అలాంటి గోవుల సంరక్షణపై నిర్లక్ష్య ధోరణి కొనసాగుతున్నది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 3.26 కోట్ల పశువులు ఉన్నాయి. రాష్ట్ర జనాభా తో సమానంగా పశువుల జనాభా ఉన్నప్పటికీ సరైన సదుపాయాలు లేకపోవడంతో అనేక గోవు లు మరణిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం పశు సంరక్షణకు ప్రాధాన్య త ఇస్తామని ముందు కు వచ్చింది.

రాష్ట్రవ్యాప్తంగా ఆయా ప్రాంతా ల్లో గోశాలలను నిర్మించి, గోవుల సంరక్షణ చేపడతామని ఇప్పటికే ప్రకటించింది. అయితే ప్రకటనలు చేసిన స్థాయిలో గోశాలల ఏర్పాటు ముందుకు సాగడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఆదరణలేక తిరుగుతున్న గోవులకు ఆశ్ర యం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి జిల్లాలో గోశాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినా, అమలు మాత్రం ఆశించిన స్థాయిలో జరగడం లేదు. కొన్ని చోట్ల భూములు గుర్తించినా పనులు మొదలుకాలేదు.

మరికొన్ని చోట్ల ప్రతిపాద నలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో గోశాలల నిర్మాణంలో తీవ్ర నిర్లక్ష్యం స్పష్టంగా కనిపి స్తోంది. ప్రణాళికాబద్ధమైన అమలులో సమన్వయ లోపం, బడ్జెట్ కేటాయింపులు తక్కువగా ఉండ టం, జిల్లా స్థాయి పర్యవేక్షణ వ్యవస్థ బలహీనత, ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల మధ్య సమన్వయ లోపం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా గోశాలల నిర్మాణం నిర్లక్ష్యానికి గురవుతున్నది. 

 పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో గోశాలల నిర్మాణానికి బడ్జెట్ కేటాయించినా నిధుల విడుదల ఆల స్యం కావడం తో ప్రాజెక్టులు నిలిచిపోయాయి. అధికారులు, కాంట్రాక్టర్ల మధ్య సమన్వయ లోపం కారణంగా అనేక జిల్లాల్లో పనులు ఆగిపో యినట్టు సమాచారం. హైదరాబాద్, మేడ్చల్, వరంగల్, నిజామాబాద్, నల్లగొండ వంటి జిల్లాల్లో గోశాలల నిర్మాణంలో జాప్యం అవుతుండటంతో గోవులు రోడ్లపై తిరుగుతూ ప్రమాదాలకు గురవుతున్నాయని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు.

అయితే ప్రభుత్వ మద్దతు లేకుండా కొన్ని స్వచ్ఛంద సంస్థలు సొంత వనరులతో గోశాలలను నిర్వహిస్తున్నాయి. కానీ ప్రభుత్వం నుంచి ఆహారం, మందులు, వైద్య సహాయం వంటి సహకారం కూడా అందడం లేదని నిర్వాహకులు వాపోతున్నారు. అయితే గోశాలల నిర్మాణంపై ప్రభుత్వం హామీలు కేవలం కాగితా లకే పరిమితం కావడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ప్రతి జిల్లాలో కనీసం ఒక ప్రభుత్వ గోశాలను ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.

ఆ యా ప్రాంతాల్లో భూముల ఎంపిక, బడ్జెట్ కేటాయింపులు జరిగినా, గోశాలల నిర్మా ణం కార్యరూపం దాల్చడంలో మాత్రం ఎక్క డా స్పష్టమైన పురోగతి కనిపించడం లేదు. కొన్నిచోట్ల ఇప్పటికీ స్థలాన్ని కూడా గుర్తించలేదని తెలుస్తోంది. అయితే దీనికి నిధుల విడుదల ప్రధాన కారణంగా కనిపిస్తుంది.

గోశాలల నిర్మాణానికి తగినంత నిధులు కేటాయించకపోవడం, కేటాయించిన నిధుల విడుదలలో జాప్యం కావడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. గోశాలల నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించకపోవడంతోనే పశు సంరక్షణ కరువైందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కేవలం ఎన్నికల సందర్భంగా, రాజకీయ చర్చల్లో మాత్రమే ఈ అంశం ప్రస్తావనకు వస్తోందని ఆరోపిస్తున్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా 21.. ఒక్కో గోశాలకు రూ. 50 కోట్లు...

రాష్ర్టంలో గోవుల పోషణ, సంరక్షణ కోసం 21 అధునాతన గోశాలలు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పశు సంవర్ధక, రెవెన్యూ, దేవాదాయ, వ్యవసాయ శాఖలకు చెందిన భూముల్లో వీటిని నిర్మించనుంది. అన్ని గోశాలలను ఒకే నమూ నాతో నిర్మిస్తారు. ఒక్కో గోశాలకు రూ.50 కోట్లు అంచనా వేశారు. ఒక ఆవుకు రోజుకు రూ. 80 నిర్వహణ ఖర్చవుతుంది. వీటి నిర్వహణకు ప్రభుత్వంతో పాటు ధార్మిక సంస్థలను కూడా భాగస్వామ్యం చేస్తారు.

గోశాలల ఇంధన అవసరాలకు అనుగుణంగా బయోగ్యాస్ ప్లాంట్లను నిర్మిస్తారు. ఆవుపేడ, మూత్రంతో జీవ ఎరువుల తయారీ యూనిట్లు నెలకొల్పుతారు. వాతావరణ సమతౌల్యంతో కూడిన హరిత భవ నాలను నిర్మిస్తారు. రాష్ర్టవ్యాప్తంగా గోశాలల కోసం 21 స్థలాలను ప్రభుత్వం ఎంపిక చేసింది.

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎన్కేపల్లిలో 98 ఎకరాలు, జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం పెద్దదిన్నెలో 99.2 ఎకరాలు, నల్గొండ జిల్లా చింతపల్లి మండలం మదనాపురంలో ఒకచోట 90.06 ఎకరాలు, మరోచోట 36 ఎకరాలు, అదే జిల్లా అడవిదేవులపల్లిలో 43.97 ఎకరాలు, కామారెడ్డి జిల్లా భిక్కనూర్లో 74.25 ఎకరాలు, భద్రాద్రి కొత్త గూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లిలో 50 ఎకరాలు, రంగారెడ్డి జిల్లా గండిపేట మండ లంలోని హిమాయత్సాగర్ వద్ద 40 ఎకరాలు, కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మం డలం బొప్పసపల్లిలో 189 ఎకరాలు, నాగిరెడ్డిపేట మండలం మాలుతుమ్మెదలో 450 ఎకరాలు, సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో 85 ఎకరాలు, జోగులాంబ జిల్లా మానవపాడు మండలం కుర్విపాడలో 50 ఎకరా లు, ఇదే జిల్లా వడ్డెపల్లి మండలం జులెకల్‌లో 82 ఎకరాలు, నల్లగొండ జిల్లా డిండిలో 153 ఎకరాలు, అదే జిల్లాలోని గుండ్లపల్లి మండలం చెరుకుపల్లిలో 43 ఎకరాలు, నిర్మల్ జిల్లా కడెంలో 27 ఎకరాలు, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలో 20 ఎకరాలు, కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో 22 ఎకరాల భూమిని ఎం పిక చేశారు.

గోవుల మృత్యువాత..

రాష్ర్టవ్యాప్తంగా 306 గోశాలలు ఉన్నాయని పశుసంవర్ధక శాఖ అధికారులు గుర్తించారు. హైదరాబాద్ లాంటి మహానగరంలో కూడా గోశాలలు ఉన్నాయి. వాస్తవంగా కేంద్ర పర్యావరణ నియంత్రణ మండలి నిబంధనలు, యానిమల్ వెల్ఫేర్ బోర్డు లాంటి సంస్థల నిబంధనల ప్రకారం నగరాల్లో గోశాలలు ఉండడానికి వీలు లేదు. కానీ నగరంలో అనేక చోట్ల గోశాలలను ఏర్పాటు చేశారు.

నగరాల్లో జనావాసాల మధ్య, అతి తక్కువ స్థలంలో పెద్ద సంఖ్యలో గోవులను పోషించడం చాలా కష్టమని, వాటికి సరైన స్థలం లేకపోవడంతో గోవులు మరణించడానికి ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నిబంధనల ప్రకారం అయితే ఒక్కో గోవు ఉండడానికి మూడు చదరపు మీటర్ల స్థలం ఉండాలి. ఏడు చదరపు మీటర్ల బహిరంగ ప్రదేశం ఉండాలి. ఇలా ఉంటేనే అవి నిలబడటానికి పడుకోవడానికి, ఇతర సమయాల్లో తిరగడానికి అనువుగా ఉంటుంది. అప్పుడే అవి ఆరోగ్యకరంగా ఉంటాయి. 

దీంతోపాటుగా తినడానికి 30 నుంచి 40 కేజీల గడ్డి అందించాల్సి ఉండగా, సగటున ఐదు నుంచి పది కేజీల వరకు మాత్రమే ఇస్తున్నారని, దీంతో అవి ఆకలికి అలమటించి, అనారోగ్యం బారిన పడి చనిపోతున్నాయని అంచనా వేస్తున్నారు. కొందరు వయసు మళ్లిన వాటిని తీసుకువచ్చి గోశాలల్లో వదులుతున్నారని, వాటికి సరైన గాలి, వెలుతురు, తిరగడానికి స్థలం లేక ఒకే దగ్గర ఉండిపోయి అనారోగ్యం బారిన పడి చనిపోతున్నాయని గుర్తించారు.

నగరంలో ఉండటంతో వాటి పేడ, మూత్రం వాసనతో సమీప ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తించారు. అదే సమయంలో వాటికి వేసే గడ్డి తిన్న తరువాత మిగలగా.. సరైన నిర్వహణ లేకపోవడంతో అది కాస్తా డ్రైనేజీల్లోకి వెళ్లి ఎక్కడో ఒక దగ్గర చిక్కుకోవడంతో.. నగరంలో గోశాలలు ఉన్న ప్రాంతాల్లో డ్రైనేజీల్లో నీరు నిలిచిపోతున్నదని గుర్తించారు. ఇలా నగరంలో ఉండటం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని, రాబోయే రోజుల్లో అనుమతులు ఇవ్వకుండా, ఏర్పాటు చేయకుండా ఉండాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

ప్రతిపాదనలకే పరిమితం..

వేములవాడ, యాదగిరిగుట్ట, ఎన్కేపల్లి ప్రాంతాలలో భారీస్థాయిలో గోశాలలను ఏర్పాటు చే యాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం రాష్ర్టవ్యాప్తంగా సకల సదుపాయాలతో మరిన్ని గోశాలలను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఇందులో భాగంగా దేవాదాయ, పశుసంవర్ధక, రెవెన్యూ, వ్యవసాయ శాఖలకు కీలక బాధ్యతలు అప్పగించారు.

ఆధునిక గోశాలల ఏర్పాటుతోపాటు గోసంరక్షణ కోసం పశుసంవర్థకశాఖ చీఫ్ సెక్రటరీ సబ్యసాచి ఘోష్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, వ్యవసాయ శాఖ సెక్రటరీ రఘునందన్తో కూడిన ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ప్రభుత్వం గోశాలల నిర్మాణానికి మార్గదర్శకాలు విడుదల చేయనుంది. వేములవాడ గోశాలలో ఆవులు ఎక్కువగా ఉండడంతో టెండర్ల పద్ధతిలో వాటిని పంపిణీ చేస్తే, మొక్కుగా దేవుడి సన్నిధికి వచ్చిన కోడెలు కొన్ని పక్కదారి పట్టి కబేళాలకు తరలివెళ్లడంతో భక్తులు తీవ్ర కలత చెందడమే కాకుండా పెద్ద దుమారమే రేగింది.

దీంతో ఈ పద్ధతిని విరమించుకున్న దేవస్థానం రైతులకు ఉచితంగా ఇచ్చే ప్రక్రియ ప్రారంభించినా, అందులోనూ లోటుపాట్లు ఉండడంతో 2024 నవంబర్లో రైతులకు పంపిణీ ఆపివేశారు. అనంతరం దీనిపై అధ్యయనం చేపట్టి కట్టుదిట్టమైన చర్యలతో 2025 జూన్ 2వ తేదీని రైతులకు తిరిగి పంపిణీ చేయడం ప్రారంభించారు. మరోవైపు గతంలో వేములవాడ గోశాలకు ప్రత్యేకంగా పశు వైద్యులు లేరు.

ఆవులకు అవసరమైనప్పుడు వైద్యసేవలు అందించేందుకు దేవస్థానం ఇప్పుడు ఆరుగురు వెటర్నరీ వైద్యులను, 8 మంది వెటర్నరీ అసిస్టెంట్లను, 40 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకుంది. వేములవాడ, యాదగిరిగుట్ట, ఎన్కేపల్లిలో సుమారు వంద ఎకరాల్లో, మిగతా ప్రాంతాల్లో కనీసం 50 ఎకరాల విస్తీర్ణం తగ్గకుండా గోశాలలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వేములవాడలో దాదాపు 60 ఎకరాలు, యాదగిరిగుట్టలో 40 నుంచి 50 ఎకరాలు గుర్తించి జిల్లా కలెక్టర్లు ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించారు. కానీ ఈ గోశాలల ప్రతిపాదనలకు ఆమోదం లభించలేదు. 

టెండర్ల దశలోనే ఎన్కేపల్లి గోశాల.. 

హైదరాబాద్ శివారు రంగారెడ్డి జిల్లా ఎన్కేపల్లిలో 98 ఎకరాల ప్రభుత్వ భూమిలో రూ. 157 కోట్లతో తెలంగాణలో అతిపెద్ద, ఆధునిక గోశాల నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టును హెచ్‌ఎండీఏ చేపట్టింది. నగరంలో సంచరించే నిరాదరణకు గురైన గోవులకు ఆశ్రయం కల్పించే లక్ష్యంతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ)కి చెందిన హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. దీనికి కావాల్సిన పాలనాపరమైన అనుమతులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

గోశాల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని రెవెన్యూ అధికారులు ఇటీవల పూర్తిస్థాయిలో సర్వే చేసి, హద్దులు నిర్ణయించి, హెచ్‌ఎండీఏకు అధికారికంగా అప్పగించారు. ప్రస్తుతం అధికారులు భూమి చుట్టూ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేసి తదుపరి టెండర్ ప్రక్రియను చేపట్టారు. టెండర్ల ప్రక్రియ పూర్తవ్వగానే వెంటనే నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. కానీ ఈ గోశాల నిర్మాణపనులు కేవలం టెండర్లకే పరిమితమయ్యాయి.