25 August, 2026 | 5:09 AM

ఎస్‌సీ కార్పొరేషన్ నిధులు ఎక్కడ?

25-08-2026 01:57 AM

ఎస్‌సీ నిరుద్యోగ యువతకు ఉపాధి ఎప్పుడు?

బీఎస్‌పీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు పుల్లూరు ఉమేష్

సిద్దిపేట, ఆగస్టు 24 (విజయక్రాంతి): ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు గతంలో కార్లు, ట్రాక్టర్లు, త్రీ వీలర్లు తదితర వాహనాలకు సబ్సిడీతో కూడిన ఆర్థిక సహాయం అందించేవారనీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండున్నర సంవత్సరాలు అవుతున్నా ఇప్పటివరకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆశించిన స్థాయిలో పథకాలు అమలు కాలేదనీ బీఎస్పీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు పుల్లూరు ఉమేష్ ఆరోపించారు.

సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజీవ్ యువ వికాసం పేరుతో దరఖాస్తులు స్వీకరించినా, అమలు మాత్రం కాగితాలకే పరిమితమైందని, నిరుద్యోగ యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారనీ మండిపడ్డారు. ఎలక్ట్రిక్ టూ వీలర్లు, త్రీ వీలర్లు అందిస్తామని చెప్పి మరోసారి  దరఖాస్తులు తీసుకున్నప్పటికీ వాటి అమలుపై స్పష్టత లేదన్నారు. 

సిద్దిపేట జిల్లాలో ఇప్పటివరకు ఒక్క వాహనం కూడా ఎస్సీ నిరుద్యోగ యువతకు అందకపోవడం బాధాకరమని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఎస్సీ కార్పొరేషన్ నిధులు విడుదల చేయడంతో పాటు, కార్లు, ట్రాక్టర్లు, త్రీ వీలర్లు తదితర స్వయం ఉపాధి యూనిట్ల కోసం కొత్తగా ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించి అర్హులైన ఎస్సీ యువతకు రూ.10 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.