03-05-2025 01:15:24 AM
-న్యాయస్థానాలు సుమోటాగా స్వీకరించి విచారణ చేపట్టాలి
-మావోయిస్టులతో బేషరతుగా శాంతి చర్చలు జరపాలి
-వామపక్షాల సదస్సులో పలువురు వక్తల డిమాండ్
ముషీరాబాద్, మే 2 (విజయక్రాంతి) : కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో బేషరతుగా శాంతి చర్చలు జరపాలి, ఆదివాసీ లను హననం చేసే ఆపరేషన్ కగార్ వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర సదస్సు వామపక్షాల ఆధ్వర్యంలో శుక్రవారం బషీర్ దేశోద్దారక భవన్ జరిగింది.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్యెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన ఈ రాష్ట్ర సదస్సులో సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, జస్టిస్ బి.చంద్ర కుమార్, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సీపీఐ ఎంల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వేములపల్లి వెంకట్రామయ్య, సీపీఐ ఎంఎల్ మాస్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.జి. రాంచందర్, ఎంసీపీఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శి ప్రసాదన్న, ఆర్.ఎస్.పీ రాష్ట్ర కార్యదర్శి ఎ.జాన కిరాములు, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి రాజా రమేష్, ఎస్.యు.సి.ఐ(కమ్యూనిస్టు) రాష్ట్ర కార్యదర్శి సిహెచ్. మురహరి, పార్వర్డ్ బ్లాక్ నాయకులు ప్రసా ద్, సీపీఐ న్యూడెమోక్రసీ నాయకులు విశ్వనాధ్, అరుణోదయ నాయకురాలు విమలక్క ప్రసంగించారు.
కగార్ ఆపరేషన్ పేరుతో రాజ్యాంగానికి విరుద్దంగా కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న మానవ సంహారాన్ని తక్షణమే నిలిపివేసి మావోయిస్టులతో బేషరత్ చర్చలు జరపాలని వారు డిమాండ్ చేశారు. ఇతర దేశాలతో యుద్దం జరిగే క్రమంలో కూడా యుద్దనీతి అనేది ఒకటి ఉంటుందని, దేశ పౌరులైన మావోయిస్టులను తేదీ, సమయం నిర్ధేశించి మరీ చంపేస్తామని ప్రకటించే హక్కు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఎవరిచ్చారని ప్రశ్నించారు.
గతంలో హిట్లర్, ముసోలీని సైతం తామే శాశ్వతంగా ఉంటామని ఇలాగే విర్రవీగి కాలగర్భంలో కలిసిపోయారని గుర్తు చేశారు. ప్రజలు ఎవరైనా తప్పు చేస్తే వారిని రాజ్యాంగ బద్దంగా ఏర్పడిన చట్టాల ప్రకారం శిక్షించాలే తప్ప కాల్చి చంపే అధికారం ఏ ఒక్కరికీ లేదని స్పష్టం చేశారు. మావోయిస్టులు శాంతి చర్చలు ప్రతిపాదించడం, ఆ తర్వాత వారు ఒక్క దాడికి పాల్పడిన ఘటన కూడా లేదన్నారు.
రాజ్యాంగబద్దంగా ఎన్నికైన కేంద్ర ప్రభుత్వం తక్షణమే వారిని శాంతి చర్చలకు పిలవాల్సిందిపోయి అందుకు పూర్తి విరుద్దంగా 25 వేల మంది కేంద్ర సాయుధ బలగాలతో కర్రెగుట్టలను అష్ట దిగ్భందనం చేసి ఆదివాసీల హనననాకి వ్యూహా రచనలు చేయడం దుర్మార్గమని వారు ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఈ ఘటనలను న్యాయస్థానాలు సుమోటాగా స్వీకరించి న్యాయ విచారణ చేపట్టాలని కోరారు.