సంక్షేమ పథకాల అమలు ఎక్కడ.. ?
- గ్రామసభలో అధికారులను నిలదీసిన గ్రామస్తులు
పోలీసుల పహారాలో సాగిన సభ
తాండూరు, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు ఎక్కడ చేస్తున్నారని.. అర్హులైన వారికి కాకుండా అన్హర్హులకు అధికారులు ఎంపిక చేయడం సరికాదని వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలం గాజీపూర్ జరిగిన గ్రామసభలో స్థానికులు అధికారులను నిలదీశారు. గురువారం సర్పంచ్ పట్లోళ్ల హేమలత ఆధ్వర్యంలో గ్రామసభను ఏర్పాటు చేశారు.
సభ ప్రారంభం కాగానే గ్రామానికి చెందిన వార్డు సభ్యులు, యువకులు మాజీ సర్పంచ్ వీరప్ప తదితరులు సంక్షేమ పథకాలు ఎవరెవరికి అందించారో? లిస్ట్ గ్రామపంచాయతీలో ప్రదర్శించా లాని పట్టుబట్టడంతో సభ గందరగోళంగా మారింది.
ఉప సర్పంచ్, వార్డు సభ్యుల సంతకాలు లేకుండా ఏకపక్ష తీర్మానాలు చేయడం సరికాదని వారు తప్పు పట్టారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి స్థానికులను సముదాయించిన లాభం లేకుండా పోయింది. అధికారులు దిగివచ్చి సంక్షేమ పథకాల జాబితాను గ్రామపంచాయతీ కార్యాలయంలో పెడతామనడంతో గ్రామస్తులు శాంతించారు. అనంతరం సభ యధావిధిగా సాగింది.




