14-08-2024 12:30:00 AM
తెలంగాణలో తొమ్మిదిన్నర సంవత్సరాలు బీఆర్‌ఎస్ పాలన సాగింది. ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్లు వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలో ఉంది. తెలంగాణలో ఆ తొమ్మిదిన్నర సంవత్సరాలు, ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన ఐదు సంవత్సరాలు ప్రజలకు ‘స్వాతంత్య్రం’ రాలేదనే చెప్పాలి. స్వతంత్ర భారతం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా అనేక వర్గాలు స్వాతంత్య్రం రాలేదని బాధ పడుతుండడంలో చాలావరకు వాస్తవం ఉంది. 140 కోట్లమంది భారత జనాభాలో ఇంచుమించు 30 కోట్లమంది పూర్తి పేదలుగా, 50 కోట్లమంది మధ్యతరగతి ప్రజలుగా నేటికీ కునారిల్లుతున్నారు.
కేవలం 10 శాతం కార్పొరేట్ ధనవంతుల గుప్పిట్లో ఇటు పాలక పక్షాలు, అటు ప్రజలు చిక్కుకున్న మాట కాదనలేని సత్యం. తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణలో గడిచిన దశాబ్దకాలం పూర్తిగా కుటుంబపాలన సాగింది. తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబ పాలనగా సాగింది. ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదు సంవత్సరాలు పరిస్థితులు మరీ దారుణంగా కొనసాగాయి. ప్రజాస్వామ్యం అనేది ఉన్నదా? అని ఈ ఐదేళ్ళు ప్రజలు బిక్కుబిక్కుమని జీవించారు.
ఇప్పుడు ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు అసలైన స్వాతంత్య్రం వచ్చింది. దేశవ్యాప్తంగా ఒక జాతీయ పార్టీ ప్రస్తుత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ‘హర్ ఘర్ తిరంగ’ అంటూ హోరెత్తిస్తున్నది. దేశంలోని అసమానతలు తొలగి, సర్వతోముఖాభివృద్ధి సాధించిన ప్పుడే నిజమైన ‘హర్ ఘర్ తిరంగ’ ఏర్పడుతుందని ఆ పార్టీ నేతలు, కేంద్రంలోని ఎన్డీఏ పాలకులు గుర్తించాలి.
-టి. రామదాసప్పనాయుడు, నాగారం