calender_icon.png 13 September, 2025 | 2:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిరునవ్వుల బాల్యాన్ని బతకనిద్దాం

13-08-2024 12:00:00 AM

డా. మహ్మద్ హసన్ :

‘పాపం, పుణ్యం, ప్రపంచ మార్గం, కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూ ఏమీ ఎరుగని పూవుల్లారా! అయిదారేడుల పాపల్లారా! మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకసమున హరివిల్లు విరిస్తే అవి మీకే అని ఆనందించే కూనల్లారా! మీదే, మీదే సమస్త విశ్వం! మీరే లోకపు భాగ్యవిధాతలు! ఉడుతల్లారా! బుడుతల్లారా! ఇది నా గీతం వింటారా?’ అంటూ కల్మషమెరుగని బాల్యానికి అక్షరాల ఆకారం ఇచ్చాడు మహాకవి శ్రీశ్రీ. ప్రతీ మనిషి జీవితంలో రంగుల కలబోత బాల్యమే. మలినం లేని చలనం వారి స్వంతం. బుడిబుడి అడుగులు, బోసినవ్వులు ఎంతటి పాషాణ హృదయులనైనా ఇట్టే కరిగిస్తాయి. 

జీవితాలు సినిమాల్లోకి!

ఈ మధ్యకాలంలో వచ్చిన రెండు పాన్ ఇండియా సినిమాల (యానిమల్, సలార్)లో ప్రధానంగా బాల్యం నేపథ్యంతోనే కథలను అల్లారు. తండ్రిని అమితంగా ఇష్టపడే కుర్రాడు. ఆ తండ్రి తన వ్యాపార పనులలో పడి పిల్లవాడిని అశ్రద్ధ చేస్తాడు. రోజు ఇంటికి ఏ రాత్రి వేళల్లోనో రావటం, అప్పటికే పిల్లలు గాఢనిద్రలో వుండటం, లేచే సమయానికే తిరిగి మళ్ళీ వ్యాపార పనుల నిమిత్తం బయటికి వెళ్ళటం ప్రతిరోజు జరుగుతుంది. ఈ క్రమంలో తండ్రి పెద్ద వ్యాపార సామ్రాజ్యం నిర్మిస్తాడు. దానికి సమాంతరంగా, బాలుడు పెరిగి పెద్దవాడవుతాడు. నాటకీయంగా తండ్రి ఎదుగుదలను తట్టుకోలేని వారి బంధువు లు హీరో అయిన బాలుడి తండ్రిని చంపి ఆస్తి కాజేయాలని చూస్తారు.

అల్లుడు కూ డా స్వంత మామను చంపాలని కుట్రలు చేస్తాడు. ఇవన్నీ హీరోకి తెలుస్తాయి. ఈ క్రమంలో స్వంత బావను చంపటం, తండ్రి శత్రువులను గుర్తిస్తూ ఒక్కొక్కరిని చంపుతూ, చివరికి ఉన్మాదిలా మారతా డు. కథ చివరలో తన కుమారుడు తన కోసమే ఇలా మారాడని ఆ తండ్రి గ్రహిస్తాడు. ఈ కథద్వారా మనం తెలుసుకో వాల్సిందేమంటే ఆ పిల్లవాడికి బాల్యంలో తండ్రినుండి దక్కాల్సిన ప్రేమ దొరికితే యానిమల్ (జంతువు)లాగా మారేవాడు కాదేమో అన్నది. ఈ కథకు కొంత నాటకీయతను జోడించి బ్లాక్ బస్టర్ జాబితాలోకి నెట్టేశాడు ఆ సినిమా దర్శకుడు. 

ఇక, మరో సినిమా ‘సలార్’లో తల్లి (ఈశ్వరీరావు) హీరో బాల్యంలో జరిగిన ఓ సంఘటనతో ఆ ప్రాంతం నుండి చిన్న పిల్లవాడిని తీసుకొని దూరంగా వెళుతుం ది. ఓ ప్రాంతంలో చిన్న పిల్లలకు పాఠాలు చెబుతూ గడుపుతుంది. కొడుకు ప్రభాస్ (పాత్ర పేరు దేవా) ఇంటికి ఆలస్యంగా వచ్చినా భయపడుతుంది. అతని చేతిలో చిన్న ఆయుధం కనిపించినా హడలి పోతుంది. తల్లి తాను అలా మారటానికి గతంలో జరిగిన సంఘటనలు పిల్లవాడిపై ప్రభావం చూయించకుండా దూరంగా వెళ్తుంది. కానీ, హీరో మళ్ళీ హింసాత్మక సంఘటనల వైపు మళ్లుతాడు. తెరమీద బీభత్సాన్ని సృష్టిస్తాడు. ఇందులోకూడా బాల్యమే అంతర్లీనంగా ప్రభావం చూపుతుందనేలా దర్శకుడు కథకు మసాలా జోడించి విజయం సాధించాడు. 

యుద్ధాలకు బలవుతున్న చిన్నారులు

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చిన్నపిల్లలపై జరుగుతున్న కొన్ని సంఘటనలు దారుణంగా ఉంటున్నాయి. 24 ఫిబ్రవరి 2022న రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన ఫలితంగా, రెండు దేశాలమధ్య యుద్ధం మొదలైంది. ఉక్రెయిన్‌కి అండగా అమెరి కా వెన్నుదన్నుగా వుంటూ శాంతి మాట లు వల్లిస్తూనే, యుద్ధాన్ని ప్రోత్సహించడం గమనార్హం. ఫలితంగా లక్షలాదిమంది నిరాశ్రయులై పొరుగు దేశాలకు వలస వెళ్ళటం, వేలమంది చనిపోవటం తెలిసిం దే.

ఉక్రెయిన్ నగరం దాదాపుగా ధ్వంసమైపోగా, లక్షలమంది చిన్నారులు పొరుగు దేశాల్లో వలసజీవుల్లా జీవించాల్సిన దుస్థి తి నెలకొంది. యుద్ధం చేస్తున్న రెండు దేశాలు, యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్న అమెరికా, యూరోపియన్ దేశాలు చిన్నారుల భవిష్యత్ గురించి ఆలోచించక పోవటం బాధ కల్గించే అంశం. మరొకవైపు ఇజ్రాయిల్  పాలస్తీనా (హమాస్) దేశాల మధ్య జరుగుతున్న మరో యుద్ధం. ఇది 7 అక్టోబర్ 2023న ప్రారంభమై చినికి చినికి గాలివానగా మారి, ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాధాన్యతాంశమైంది. 

అక్కడ జరుగుతున్న నరమేధం పట్ల యావత్ ప్రపంచం సానుభూతిని వ్యక్తం చేస్తున్నది. ఈ కొద్ది నెలల కాలంలోనే సుమారు నలబై వేలమంది చనిపోవటం, వారిలో చిన్న పిల్లలే మూడు వంతులుకు పైగా వున్నారంటే యుద్ధాలవల్ల నష్టపోయేది ఎవరనేది ఈ పాటికే అర్థంచేసు కోవచ్చు. గాజాలో పిల్లలు ఆహారం దొరక్క గడ్డి, బురద మన్ను వంటివి తింటూ గడుపుతున్న దృశ్యాలు.. మానవ జాతి తల దించుకోవాల్సిన పరిస్థితి. ఈ రెండు దేశా ల మధ్య జరుగుతున్న నరమేధాన్ని ప్రపం చ దేశాలు ఆపటానికి ప్రయత్నించక పోవటం, ఐక్యరాజ్యసమితి కూడా చేష్టలుడిగి చేతులెత్తెయ్యటంతో ఫలితం ప్రశ్నార్థక మైంది. ‘కక్షతో కానిది, సాధించనిది క్షమాబిక్షతో సాధించాలి. కత్తితో ఛేదించనిది కరుణతో ఛేదించాలి’ అన్న హిత వాక్కు ఇక్కడ గమనార్హం.

అశాంతికి ఎవరు బాధ్యులు?

రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయిల్, పాలస్తీనా, నైజీరియా, జర్మనీ, లిబియా, ఏ దేశంలోనైనా పిల్లలే వుంటారు. పిల్లలు లేని ప్రపంచాన్ని ఊహించగలమా? స్వేచ్ఛ గా ఎగరాల్సిన బాల్యాన్ని వారి రంగురంగుల ప్రపంచాన్ని పెద్దలుగా మనం ఏం చేస్తున్నాం? ఎలాంటి సమాజంలో ఉంటు న్నాం? వారి భవిష్యత్ ఏం కానుంది? ఎగరకుండా రెక్కలు తెంచి వదిలేస్తే వాళ్లు ఎక్కడికి వెళ్ళగలరు? యుద్ధాలు, హింసాత్మక సంఘటనల ద్వారా బాల్యాన్ని చిదిమి వేస్తున్నాం.

అలాంటి బాలలు రేపు ఎలా తయారవుతారు? ప్రతీకారం వైపు ప్రయాణిస్తే ఎవరు బాధ్యులు? ప్రపంచంలో శాంతి సామరస్యాలు ఎలా వెళ్లి విరుస్తాయి? పెద్దవారుగా మనం ఇలాగేనే వ్యవహరించేది? ప్రస్తుత సమాజంలో శాంతిని పారదోలుతూ భవిష్యత్తులో వారి నుండి శాంతియుత సమాజాన్ని ఏ రకం గా ఆశించగలం? ఓ హిట్లర్ నరమేధం చరిత్ర గతిని మారిస్తే యుద్ధ వాతావరణంలో పెరిగిన పిల్లలు భవిష్యత్తులో దేశా ధ్యక్షులుగా మరెందరో హిట్లర్లుగా ముదిరితే, సమాజం ఏమవుతుంది? చిన్న పిల్లల పట్ల నరమేధం సృష్టించడం మానవత్వం అనిపించుకుంటుందా? నిత్యం బాంబు లు, హింసాత్మక సంఘటనల మధ్య పెరిగిన బాల్యం పెరిగి పెద్దైన తర్వా త మళ్ళీ హింసవైపు మళ్లదని ఎవరైనా హామీ ఇవ్వగల రా? రెక్కలు తెగిన బాల్యాన్ని ఎవరైనా కోరుకుంటారా? 

ఓ కుటుంబంలో మానసిక వికలాంగుడిగానో, శారీరక వైకల్యంతోనో అమ్మా యో, అబ్బాయో పుడితే ఆ తల్లిదండ్రులు అనుభవించే బాధ నరకం కన్నా ఎక్కువ. మరి, అలాంటిది యుద్ధాలలో గాయపడిన, చనిపోయిన పిల్లల్ని తల్చుకుంటూ ఆ తల్లిదండ్రులు పడే ఆవేదన వర్ణనాతీతం. సాటి మనుషులుగా మనం వారిని అర్థం చేసుకోవాలి కదా? ‘ఎవరు ఎటు పోతేనేం, మనం సురక్షితంగా ఉన్నాం’ అనుకుంటే సరిపోదు. ఆ పిల్లల ద్వారా భవిష్యత్తులో హింస జరిగితే దానికి బాధ్యత వహించాల్సింది మనమే అన్నది గుర్తించాలి. పెద్దలు గా మనం పిల్లల్ని ఎటు తీసుకొని వెళ్తున్నామో, ఏ వాతావరణాన్ని వారికి  మనం కానుకగా ఇస్తున్నామో ఆలోచించాలి. 

అలజడి లేని సమాజం వైపుకు!

‘చిన్నారులు సామూహికంగా కలుసుకుంటారు/ అనంత విశ్వసాగర తీరంలో/ పైన గగనం దిగువ అలల అలజడిలో కడలి/ పిల్లలెప్పుడూ ఆడుతూ, పాడుతూ/ నవ్వుతూ, నర్తిస్తూ పోగవుతారు/ తీరంలో ని ఇసుకతో గూళ్ళుకట్టి/ ఆటలాడుతారు గవ్వలతో/ సాగరంలో ఎండుటాకులనే/ పడవలుగా వదిలి నవ్వుతుంటారు/ చిన్నారులు ఆడుకుంటారు/ అనంత విశ్వసాగర తీరంలో..’ అంటూ రంగుల బాల్యాన్ని వర్ణించాడు విశ్వకవి రవీంద్రుడు. మనం పిల్లల ముఖంలో ఎప్పుడూ ఆనందాన్నే కోరుకుందాం. ఎలాంటి అలజడి లేని సమాజాన్ని వారికి కానుకగా ఇవ్వడానికి మన వంతుగా ప్రయత్నిద్దాం. ఎక్కడ మనసు నిర్భయంగా నిలుస్తుందో, జ్ఞానం స్వేచ్ఛాయుతంగా ఉంటుందో అటువంటి సమాజాన్ని నిర్మించి పిల్లలకు అందిద్దాం.         

వ్యాసకర్త సెల్: 9908059234