కేసీఆర్ హయాంలో వైట్ కోట్ విప్లవం
మాజీ మంత్రి హరీశ్ రావు
ఉప్పల్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఎంబీబీఎస్ విద్యార్థులకు చెక్కుల పంపిణీ
హైదరాబాద్, మార్చి 3 (విజయక్రాంతి): మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దూరదృష్టి నాయకత్వంలో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో వైద్య కళాశాలల స్థాపనతో వైట్ కోట్ విప్లవం సాకారమైందని, దీంతో వైద్య విద్య అవకాశాలు విస్తరించి, ప్రభుత్వ వైద్య సేవలు మరింత బలోపేతం అయ్యాయని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
మంగళవారం ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో హరీశ్ రావు నివాసంలో ఏడుగురు ఎంబీబీఎస్ విద్యార్థులకు చెక్కులు అందజేశారు. బీఎల్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులకు చెక్కులు అందజేయడం అభినందనీయమన్నారు.
ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే మొత్తం 122 మంది వైద్య విద్యార్థులకు వారి విద్యా ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందించడం జరిగిందని, ఇది కేవలం దానంగా కాకుండా, భవిష్య త్ ఆరోగ్య వ్యవస్థలో పెట్టుబడిగా భావించాల్సిన అంశమని ఆయన తెలిపారు. వెనుక బడిన వర్గాల నుంచి వచ్చే ప్రతిభావంతమైన యువతను ప్రోత్సహిస్తూ, విద్య ద్వారా సాధికారత కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు దేవేందర్ రెడ్డి , బీఆర్‌ఎస్ నాయకులు ప్రభుదాస్, ప్రవీణ్ ముదిరాజ్, మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




