ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య
నాగోల్‌లో విజిబుల్ పోలీసింగ్ ట్రాఫిక్, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై ప్రజలకు అవగాహన
నాగోల్, జూలై 1 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, వాటిని ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య హెచ్చరించారు.
విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం సాయంత్రం నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగోల్ ఎక్స్రోడ్డు వద్ద ప్రత్యేక వాహన తనిఖీలు, ట్రాఫిక్ నియంత్రణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగోల్ సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ, ఎస్‌ఐలు రమేష్, ఉమతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, ట్రాఫిక్ సిగ్నళ్లను ఉల్లంఘించడం వంటి చర్యలే ప్రమాదాలకు ప్రధాన కారణమని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడం, మైనర్లకు వాహనాలు అప్పగించడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. సైబర్ నేరాలపై కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, అపరిచితుల ఫోన్ కాల్స్ లేదా సందేశాలకు స్పందించి బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు పంచుకోవద్దని హెచ్చరించారు.
అలాగే గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచాలని సూచించారు. పరిసరాల్లో గంజాయి విక్రయాలు లేదా ఇతర అక్రమ కార్యకలాపాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఏసీపీ హామీ ఇచ్చారు. ‘డ్రగ్స్కు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి.. సైబర్ నేరాలకు దూరంగా ఉండి మీ డబ్బును రక్షించుకోండి.. ట్రాఫిక్ నియమాలు పాటించి మీ ప్రాణాలను కాపాడుకోండి‘ అని ఏసీపీ కృష్ణయ్య ప్రజలకు పిలుపునిచ్చారు.






