నిధులు లేని ప్రజాపాలన ప్రణాళిక ఎందుకు ?
బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు మనోహర్ ప్రసాద్ పటేల్, రమేష్ రావు
అచ్చంపేట మార్చు 6:గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో నిర్వహించిన ప్రత్యేక పట్టణ ప్రణాళిక కార్యక్రమానికి.. అప్పటి ప్రభుత్వం నిధులు కేటాయించేదని ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్లు మనోహర్ ప్రసాద్ పటేల్, రమేష్ రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజులపాటు నిర్వహించనున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం పై వారు మాట్లాడారు. నిధులు కేటాయించని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కార్యక్రమానికి సంబంధించిన పూర్తి విధివిధానాలు ఏమిటో అధికారులకు.. ఆ పార్టీకి సంబంధించిన నాయకులకు సైతం తెలియదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమానికి అధికార పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్పర్సన్, ఇతర కౌన్సిలర్లు కో ఆప్షన్ సభ్యులు హాజరు కాకపోవడాన్ని ఆయన నిలదీశారు. ప్రభుత్వంపై నమ్మకం లేకనే వారంతా హాజరు కాలేదని ఆరోపించారు.
కమిషనర్ సైతం గైర్హాజరు కావడం తమను మిస్మయానికి గురిచేసిందని చెప్పారు. అచ్చంపేట ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నిర్వహిస్తున్న కల్వర్టు పనులను ఇప్పటికే అనేక మార్లు ఎమ్మెల్యే ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు పరిశీలించారని.. కానీ పనులు నేటికీ పూర్తికాలేదని అన్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం తక్షణమే ఆ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి సంబంధించిన పూర్తి విధివిధానాలు విధుల కేటాయింపును ప్రభుత్వ చేపట్టాలని డిమాండ్ చేశారు. వాటిలవారీగా వెళ్లి ప్రజా అవసరాలకు గుర్తించి సమస్యలు పరిష్కరించాలని కోరారు.




