16-12-2025 01:10:01 AM
పంచాయతీ ఫలితాలపై హస్తం పార్టీలో అంతర్మథనం!
హైదరాబాద్, డిసెంబర్ 15 (విజయక్రాంతి) : రెండు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లను హస్తగతం చేసుకున్నామని అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు పైకి చెబుతున్నా, అంతర్గతంగా మాత్రం ఆందోళన చెందుతున్నారు. పంచాయతీ పోరులో బీఆర్‌ఎస్ గ్రాఫ్ అనూహ్యంగా పెరగడం, రెండు వేలకు పైగా సర్పంచ్ స్థానాలు గెలుచుకోవడంతో కాంగ్రెస్ నాయకుల్లో అంతర్మథనం మొదలైంది. అనుకున్న లక్ష్యానికి ఎందుకు చేరుకోలేపోయామనే అంశంపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది.
డీసీసీ అధ్యక్షులు, పార్టీ నాయకులు, క్షేత్రస్థాయిలోకి వెళ్లి సీరియస్‌గా పనిచేయలేదని.. అసంతృప్తులను, అసమ్మతిని బుజ్జగించి దారిలోకి తీసుకురావడంలో డీసీసీ అధ్యక్షులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ఇన్‌చార్జ్‌లు, మండల పార్టీ నాయకులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నా యి. రెబల్స్‌ను బుజ్జగించి.. పోటీ నుంచి తప్పించకుండా వదిలేయడం వల్లే పంచాయతీ పోరులో అనుకున్న లక్ష్యం సాధించలేకపోయామనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ పరిస్థితి వల్లే ఓట్లు బాగా చీలి బీఆర్‌ఎస్, బీజేపీ లాభపడ్డాయి అని అంటున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు వివరించడంలోనూ వెనకబడిపోయినట్లుగా కాంగ్రెస్ నేతలు గుర్తించినట్లుగా గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే 70 నుంచి 80 శాతం వరకు సర్పంచ్‌లను గెలుచుకుంటామని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెబుతున్న విషయం తెలిసిందే.
కానీ, రెండు విడతల్లో 8,555 గ్రామాల్లో ఎన్నికలు జరుగగా కాంగ్రెస్ పార్టీ 4,579 పంచాయతీల్లో మాత్రమే విజయం సాధించింది. ఇక బీఆర్‌ఎస్ 2,357, బీజేపీ 457, ఇతరులు 1,162 సర్పంచ్ స్థానాల్లో గెలుపొందారు. రెండు విడతల్లో వచ్చిన ఫలితాలు మూడో విడతలో పునరావృతం కాకుండా జగ్రత్తపడా ల్సిన అవసరం ఉందని, అందుకు ప్రతి నాయకుడు అప్రమత్తంగా ఉండాలని గాంధీభవన్ నుంచి డీసీసీ అధ్యక్షులు, స్థానిక నాయకులకు ఆదేశాలు వెళ్లినట్లుగా తెలిసింది. ఇదే పరిస్థితి కొనసాగితే, త్వరలోనే పార్టీపరంగా జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, కార్పోరేషన్ల ఎన్నికల్లో నష్టం జరుగుతుందని పార్టీ పెద్దలు హెచ్చరిక కూడా చేస్తున్నారు.
బీఆర్‌ఎస్ పార్టీ వెయ్యిలోపే సర్పంచ్‌లు గెలుస్తుందని కాంగ్రెస్ నేతలు మొదటి నుం చి భావించారు. కానీ, ఫలితాలు చూస్తే ఆశ్చర్యపడాల్సిన పరిస్థితి వచ్చిందని వారు చెబు తున్నారు. చాలా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు గట్టిపోటీ ఇచ్చారని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థుల తరపున మం త్రులు, కొందరు ఎమ్మెల్యేలతో పాటు డీసీసీ నాయకుల్లో కొందరు పనిచేసినా.. మరికొందరు పెద్దగా దృష్టి సారించలేదని, అందుకే సగం స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చిందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సన్న బియ్యం, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, రూ. 500లకే గ్యాస్ సిలిండర్ లాంటి సంక్షేమ పథకాలు అందజేస్తున్నా ఫలితాలు ఆశించిన మేర ఫలితాలు రాలేదనే చర్చ జరు గుతోంది. మరోవైపు బీఆర్‌ఎస్ స్థానిక క్యాడ ర్ పంచాయతీ ఎన్నికలను సవాల్‌గా తీసుకుని.. కాంగ్రెస్‌కు ధీటుగా పనిచేసి 2 వేలకు పైగా సర్పంచ్‌లను గెలిపించుకున్నారని చర్చ జరుగుతోంది.
ఇక బీజేపీ కూడా ఊహించని విధంగా ఫలితాలను సాధించుకుంది. రెండు విడతలు కలిపి 457 పంచాయతీలు గెలవడంపై ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వమే ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. ఇక స్వతంత్రులు కూడా 1,162 గెలవడం అధికార పార్టీని మరింత ఆందోళనకు గురిచేస్తున్నది.