calender_icon.png 14 September, 2025 | 5:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీనేజ్‌లో నేర మనస్తత్వం ఎందుకిలా?

26-06-2025 12:00:00 AM

మేడ్చల్‌లో జరిగిన కన్నతల్లి హత్య ఘటన ఒక మేలుకొలుపు. ఇది కేవలం ఒక బాలిక చేసిన నేరం కాదు. అది ఒక వ్యవస్థాగత వైఫల్యం. ప్రభుత్వం కండ్లు తెరిచి, కేవలం ఆర్థిక అభివృద్ధిపైనేకాక మానవతా విలువలు, సామాజిక న్యాయం, నైతికత వంటి అంశాలపై దృష్టి సారించాలి. 

మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పరిధిలోని ఎన్‌ఎల్బీ నగర్‌లో జరిగిన దారుణం యావత్ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. పదో తరగతి చదువుతున్న 16 ఏండ్ల బాలిక, తన ప్రియుడితో కలిసి కన్నతల్లిని అత్యంత కిరాతకంగా హత్య చేసింది. ప్రేమ వ్యవహారం లో కుమార్తెను మందలించిందన్న కోపం తో తాను ఈ ఘాతుకానికి పాల్పడినట్టు వెల్లడైంది.

ఈ ఒక్క సంఘటన కాదు ఇలాంటి ఎన్నో నేరాలు, ఘోరాలు అడపాదడపా వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ నేరాలకు కేవలం టీనేజర్ల హార్మోన్ల మార్పులనో, స్మార్ట్‌ఫోన్‌ల ప్రభావాలనో కారణం గా చెప్పి సరి పెట్టుకోవడం నిజాయితీ కాదు. అసలు పసి మనసుల్లో ఈ రకమైన పగ, హింసను ఎవరు పెంచుతున్నారు? ప్రభుత్వాలకు ఇందులో బాధ్యత లేదా?

ఇంత బాధ్యతా రాహిత్యమా?

“టీనేజ్‌లో అమ్మాయిలకు గాని, అబ్బాయిలకు గాని తాము తీసుకున్న నిర్ణయమే సరైంది అని గాఢంగా అనిపించడమే ఇం దుకు కారణం. కౌన్సెలింగ్ ఇచ్చేంత ఆలోచనలు లేని అమాయకులైన తల్లిదం డ్రు లు.” సామాజిక మాధ్యమాల్లో పలువురు చెబుతున్న ఇలాంటి మాటలు చాలా లోతై న అంశాలను స్పృశిస్తున్నాయి. తల్లిదండ్రులకు మానవ విలువలు, సామాజిక ఇంజినీరింగ్, ప్రభుత్వాల పాత్రపై అవగాహన ఉండాలని ఆశిస్తాం.

కానీ, వారికి ఈ అవగాహన కల్పించే బాధ్యత ఎవరిది? వ్యవస్థలో మార్పు తీసుకు రావడానికి, సమాజానికి సరైన దిశానిర్దేశం చేయడానికి ప్రభుత్వాలు కీ రోల్ పోషించాలి. కానీ నేటి ప్రభుత్వాలు ఈ సామాజిక బాధ్యత ను విస్మరించి, కేవలం ఓట్ల రాజకీయా లకే పరిమితమవుతున్నాయి. విద్య అనేది కేవ లం మార్కులు, డిగ్రీలు సంపాదించ డం కోసమే కాదు. అది వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దా లి, విలువలను నేర్పాలి.

సామాజిక బాధ్యతను కల్పించాలి. కానీ, మన విద్యా వ్యవస్థ కేవలం పాఠ్య పుస్తకాలకే పరిమితమై, నైతి క విద్యను, జీవన నైపుణ్యాలను విస్మరిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో కౌన్సెలింగ్ సదుపాయాలు లేకపోవడం, ఉపాధ్యాయులకు ఈ అంశాలపై శిక్షణ లేకపోవడం వంటివి పిల్లల మానసిక వికాసానికి పెద్ద అడ్డంకిగా మారు తున్నాయి. నేటి తల్లిదండ్రులు చాలామం ది ఆర్థిక ఒత్తిళ్లలో లేదా స్వయం కృతాప రాధంతో పిల్లలపై దృష్టి పెట్టలేక పోతున్నారు.

వారికి పిల్లల పెంపకంపై, టీనేజ్ మనస్తత్వంపై, డిజిటల్ ప్రభా వాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యతను ప్రభుత్వాలు తీసుకోవాలి. తల్లిదం డ్రుల వర్క్‌షాప్స్, కౌన్సెలింగ్ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించాలి. వారి అజ్ఞా నం, అమాయకత్వం నేరాలకు దారి తీస్తుం టే, ప్రభుత్వాలు చూస్తూ ఊరుకోవడం భావ్యం కాదు.

కంటెంట్‌పై నియంత్రణ వద్దా?

టీవీ సీరియళ్లలో హత్యలకు పథకాలు, రియాలిటీ షోస్‌లలో బూతులు, ద్వంద్వార్థాలతో వెకిలిచేష్టలు వంటివన్నీ టీనేజ్ యువతపై చాలా ప్రభావం చూపుతున్నాయి. ఇది నేరుగా ప్రభుత్వ నియంత్రణ వైఫల్యాన్ని ప్రశ్నించే అంశం. నేడు టీవీ చానెళ్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, సోషల్ మీడియాలలో అడ్డూ అదుపూ లేకుండా బాధ్య తారాహిత్య కంటెంట్ ప్రచారంలోకి వస్తున్నది.

హత్యలు, క్రైమ్ థ్రిల్లర్లు, వివాహేతర సంబంధాలు, పగలు, ప్రతీకారాలతో నిం డిన సీరియళ్లు, సినిమాలను నియంత్రించడంలో ప్రభుత్వాలు ఎందుకు విఫలమ వుతున్నాయి? కఠినమైన సెన్సార్‌షిప్ నిబంధనలు ఉన్నప్పటికీ, వాటిని అమలు చేయడంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. రేటింగుల కోసం  స మాజాన్ని దిగజార్చే కంటెంట్‌ను అనుమతించడం తక్షణం ఆపాలి.

బూతులు, ద్వం ద్వార్థాలతో కూడిన సంభాషణలు, వెకిలి చేష్టలను ప్రోత్సహించే రియాలిటీ షోలు టీనేజ్ పిల్లల మనసుల్ని కలుషితం చేస్తున్నాయి. వీటి గురించి ప్రభుత్వాలు దృష్టి సారించాలి. కేవలం రాజకీయ పార్టీల విమర్శలకు, ప్రతి విమర్శలకే మీడియా స్వే చ్ఛను వాడుకుంటూ, సామాజిక విలువల విధ్వంసంపై మౌనం వహించడం భావ్యం కాదు.

స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్ల ద్వారా కూ డా పిల్లలు సులభంగా హింసాత్మక, అశ్లీల కంటెంట్‌ను యాక్సెస్ చేయగ లుగుతు న్నారు. వీటిని నియంత్రించడానికి సమర్థవంతమైన చట్టాలు అవసరం. వాటిని అమలు చేసే యంత్రాంగాలను ప్రభుత్వా లు రూపొందించాలి.

సైబర్ సెక్యూరిటీపై ప్రజలలో అవగాహన కల్పించాలి. ప్రజల ఆరోగ్యాన్ని, మానసిక వికాసాన్ని దెబ్బ తీసే కంటెంట్‌ను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది. కానీ, ఓట్ల బ్యాంకు రాజకీయాలు, కార్పొరేట్ ప్రయోజనాల ముందు ఇది నిర్లక్ష్యానికి లోనవుతున్నది.

అందరూ చొరవ తీసుకోవాలి

మేడ్చల్ ఘటన వంటివి కేవలం వ్యక్తిగత నేరాలు కావు. అవి సమాజంలో పేరుకుపోయిన విలువలను కోల్పోవడం, ప్రభుత్వాల బాధ్యతా రాహిత్యానికి ప్రతిబింబాలు. బంధాలకు విలువ ఇవ్వడం, కరుణ, దయ, సామాజిక బాధ్యత వంటి మానవీయ విలువలను పెంపొందించేందుకు ప్రభుత్వాలు స్పష్టమైన విధానాలు, కార్యక్రమాలు రూపొందించాల్సి ఉంది.

కేవలం చట్టాలు చేస్తే సరిపోదు, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి వారిలో మార్పు తెచ్చే బాధ్యతను కూడా అధికారులు తీసుకోవాలి. నేరాలు జరిగినప్పుడు కఠిన శిక్షలు, త్వరితగతిన న్యాయం అందించడంలో జరుగుతున్న జాప్యం నేరస్తుల్లో భయాన్ని తగ్గిస్తున్నది. దీనివల్ల ఇతరులు కూడా నేరాలకు పాల్పడే అవకాశం ఏర్పడుతున్నది. న్యాయ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం చాలా ఉంది.

పేదరికం, నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు కూడా నేరా లకు దారి తీసే పరోక్ష కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు. నేటి సమాజంలో జరుగుతున్న దారుణాలకు ప్రభుత్వాల అలసత్వం, విధానాల లోపాలు కూడా ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. కేవలం నేరాలు జరిగినప్పుడు అరెస్టులు, దర్యాప్తులు చేసి చేతులు దులుపుకోవడం కాదు. అసలు నేరాలు జరక్కుండా మంచి, ఉదాత్త వాతావరణాన్ని సృష్టించాల్సిన బాధ్యతనూ అందరూ తీసుకోవాలి.

మేడ్చల్‌లో జరిగిన కన్నతల్లి హత్య ఘటన ఒక మేలుకొలుపు. ఇది కేవలం ఒక బాలిక చేసిన నేరం కాదు. అది ఒక వ్యవస్థాగత వైఫల్యం. ప్రభుత్వం కండ్లు తెరిచి, కేవలం ఆర్థిక అభివృద్ధిపైనే కాకుండా మానవతా విలువలు, సామాజిక న్యాయం, నైతికత వంటి అంశాలపై దృష్టి సారించాలి.

విద్య, మీడియా, కుటుంబం ఈ మూడు స్తంభాలను బలోపేతం చేయడానికి సమగ్ర విధానాలను రూపొందాలి. లేకపోతే, పసి మనసుల్లో పగ, హింస పెరిగి అలాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉంటాయి.

వ్యాసకర్త సెల్: 9912178129