26-06-2025 12:00:00 AM
ఒక నియోజక వర్గం పరిధిలో ఓటర్లు తమ ఇష్టాయిష్టాల మేరకే ఓటు వేస్తారు తప్ప పార్టీల గొప్పతనాన్ని చూసి ఓటు వేయరనేది ఇటీవలి ఉప ఎన్నికల ఫలితాల్లో మరోమారు స్పష్టమైంది. నాలుగు రాష్ట్రాల్లో, ఐదు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు జాతీయ స్థాయిలో పార్టీలపై ఓటర్ల మనోభావాన్ని ప్రతిబింబించాయని చెప్పలేం. స్థానిక సమస్యలు, అభ్యర్థుల తీరుతెన్నులే ఉప ఎన్నికల్లో ఎక్కువగా ప్రధానాంశాలుగా ఉంటాయి.
భావజాలాలు, విధానాల కంటే ఎక్కువగా కుల సమీకరణలు కూడా ఉప ఎన్నికలను ప్రభావితం చేస్తుంటాయి. గుజరాత్‌లోని విసావదార్, కడి, పంజాబ్‌లోని లూథియానా, కేరళలోని నీలాంబుర్, పశ్చిమ బెంగాలోని కాళిగంజ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఉత్సాహాన్నిచ్చాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదుర్కొన్న ఆమ్ ఆద్మీ పార్టీకి గుజరాత్‌లో విసావదార్ స్థానంలో విజయం దక్కింది.
2022 ఎన్నికల్లో ఆ పార్టీ గుజరాత్‌లో ఐదు సీట్లు దక్కించుకొంది. అందులో విసావదార్ ఒకటి. ఆ తర్వాత గుజరాత్‌లో ఇతర పార్టీల నుంచి చాలామంది ఎమ్మెల్యేలను అధికార బీజేపీ, ఫిరాయింపుల ద్వారా తమ పార్టీలో కలుపుకొంది. అప్పుడు బీజేపీకి విసావదార్ ఆప్ ఎమ్మెల్యేకూడా ఫిరాయించారు. విసావదార్‌లో ఆప్ ఇప్పుడు బీజేపీపై ప్రతీకరం తీర్చుకుంది. కడి స్థానంలో గెలిచి బీజేపీ పరువు నిలుపుకొంది.
ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలకు ప్రతిష్ఠాత్మకంగా ఉంటే గుజరాత్ ఎన్నికల్లో, బీజేపీ నెగ్గుకు రాకపోవడం కొంత ఆశ్చర్యకరమే. ‘ఆపరేషన్ సిందూర్’ బీజేపీకి ఈ ఎన్నికల్లో కలిసి రాకపోవడం స్పష్టంగా కనిపిస్తున్నది. నిజానికి ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ ఐదు స్థానాలకు పోటీ చేసినా దక్కింది ఒక్కటే. కార్యక్షేత్రంలో బీజేపీ తన ప్రచార పంథాను మార్చుకొని ముందుకు వెళ్లకపోతే రానున్న ఫలితాలు కూడా ఇలాగే వుండవచ్చునన్న మేల్కొలుపు సందేశాన్ని ఈ ఉప ఎన్నికలు ఇచ్చినట్లయింది.
గత లోక్‌సభ ఎన్నికల్లో ఎదురు దెబ్బలెదురైనా, కేంద్రంలో అధికారంలోకి రాగలిగిన బీజేపీ, ఆ తర్వాత కొన్ని నెలల వ్యవధిలోనే జరిగిన మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో ఆశించిన ఫలితాలను రాబట్టలేక పోయింది. కేరళలోని నీలాంబుర్ స్థానంలో బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా రాలేదు. పంజాబ్‌లోని లూథియానా స్థానంలో ఆప్ అభ్యర్థికి కాంగ్రెస్ అభ్యర్థి గట్టి పోటీగా నిలిచారే తప్ప బీజేపీ అభ్యర్థి కాదు ఈ స్థానంలో ఆప్ విజయం సాధించగా, బీజేపీ మూడో స్థానంతో సరిపెట్టుకుంది.
అటు విసావదార్, ఇటు లూథియానా గెలుపుతో ఆప్ నేత కెజ్రీవాల్ తిరిగి పాప్యులారిటీని సాధిస్తున్నట్లు కనిపిస్తున్నది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్‌లో తనకు ఎదురే లేదని మమతా బెనర్జీ మరోసారి నిరూపించుకు న్నారు. కాళిగంజ్ స్థానంలో తృణమూల్ అభ్యర్థి దాదాపు 50 వేల ఓట్ల ఆధిక్యతను సాధించడం విశేషం. ఓటు శాతంతో బీజేపీ ఇక్కడ అంతకంతకూ పడిపోతున్నది.
కాంగ్రెస్ నాయకత్వంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్)కు ఈసారి కేరళలోని నీలాంబుర్‌లో గెలుపు ఆవశ్యకతగా మారింది. గతంలో రాహుల్‌గాంధీ, ప్రస్తుతం ప్రియాంకగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న వాయనాడ్ పార్లమెంటరీ నియోజక వర్గంలోనే నీలాంబుర్ అసెంబ్లీ స్థానం ఉంది. కనుక, అక్కడ విజయం సాధించకపోతే తలవంపులేనని కాంగ్రెస్ భావించింది. ఐదు స్థానాల ఉప ఉన్నికల్లో నాలుగింట ఓటమి చవిచూసిన కాంగ్రెస్, బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే కార్యాచరణ ఏమిటనేది ఆలోచించుకోవాల్సిందే.