02-08-2025 12:00:54 AM
బీఆర్‌ఎస్ నేతలు శ్రీనివాస్ గౌడ్, స్వామిగౌడ్..
హైదరాబాద్ (విజయక్రాంతి): కేసీఆర్ హాయంలో ఉన్న కల్లు దుకాణాలే ఇప్పటికీ ఉన్నాయని.. అయితే అప్పుడు లేని కల్తీకల్లు వ్యవహారం ఇప్పుడు ఎందుకు జరుగుతోందని శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Former Minister Srinivas Goud) ప్రశ్నించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. కల్తీకల్లు దోషులెవరో తేలక ముందే కల్లు దుకాణదారులను ఎక్సైజ్‌శాఖ అధికారులు వేధిస్తున్నారని, రెస్టారెంట్లలో, నూనె కర్మాగారాల్లో కల్తీ జరుగుతోందని, వాటిపై దాడులు జరుగుతున్నాయా? అని నిలదీశారు. పాల కల్తీ విపరీతంగా జరుగుతోందని, ఇంతవరకు ఎవరిపై చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు.
హైదరాబాద్‌లో కల్లు దుకాణాలపై ఆధారపడి లక్షా యాభై వేల మంది బతుకుతున్నారని, వారి పొట్టగొట్టే ప్రయత్నాన్ని తాము సహించబోమన్నారు. కల్తీకల్లు అరికట్టడానికి దుకాణాల్లో థర్డ్‌పార్టీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కల్లు దుకాణాలపై వేధింపు చర్యలు ఆపాలని కోరారు. మద్యం మాఫియా కల్తీ కల్లు నివారణ పేరిట లిక్కర్ మాఫియాను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.