02-08-2025 12:01:10 AM
సిద్దిపేట, ఆగస్టు 1(విజయక్రాంతి): ప్రపంచ తల్లిపాల వారోత్సవాల పోస్టర్లను జిల్లా అదనపు కలెక్టర్ గరీమ అగర్వాల్ ఐసిడిఎస్ సిడిపిఓ లతో కలిసి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో, రూట్ లెవల్లో తల్లిపాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అవసరమన్నారు. ప్రతి తల్లి తల్లిపాల ప్రాధాన్యతను తెలుసుకోవాలని సూచించారు.
తల్లిపాలను ప్రాధాన్యతనివ్వండి, స్థిరమైన మద్దతు వ్యవస్థలను సృష్టించండి ఈ థీమ్ ప్రకారం, ప్రసూతి సెలవులపై సరైన విధానాలు, ఆరోగ్య సిబ్బందికి శిక్షణ, పని ప్రదేశాల్లో తల్లులకు అనుకూల వాతావరణం వంటి చర్యలు తల్లిపాలను ప్రోత్సహించేందుకు అవసరమని ఆమె పేర్కొన్నారు. తల్లి పాలు ఇవ్వడం వల్ల తల్లులకు, శిశువులకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు,
రోగ నిరోధక శక్తి పెంపు వంటి అంశాలపై గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు సంకల్పంతో వారోత్సవాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ అధికారి లక్ష్మీకాంత్ రెడ్డి, సీడీపీవోలు, పోషణ్ అభియాన్ జిల్లా సమన్వయకర్తలు, ప్రాజెక్ట్ అసిస్టెంట్లు, ఐటీ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.