ఇకనైనా అక్రమాలకు అడ్డుకట్ట పడేనా?
- ఆదిలాబాద్ నూతన పాలకవర్గంపై ప్రజల గంపెడు ఆశలు
ప్రత్యేక పాలనలో ప్రజలకు అందని సేవలు
నేడు బడ్జెట్‌పై ప్రత్యేక సమావేశం
ఆదిలాబాద్, మార్చి 30 (విజయక్రాంతి): నూతన పాలకవర్గం ఏర్పాటుతో ఆదిలాబాద్ బల్దియా ఇప్పుడైన అభివృద్ధి దిశగా అడుగు లు వేసేనా అని పట్టణ ప్రజలు ఎదురుచూస్తున్నారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారం అయ్యేనా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఇటీవలే మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. దీంతో ఆదిలాబాద్ మున్సిపల్ ప్రత్యేకాధికారి పాలనకు తెర పడింది.
ప్రజలు ఎన్నుకున్న నూతన పాలకవర్గం అందుబాటులోకి వచ్చింది. దాదాపు రెండు సంవత్సరాల పాటు పాలకవర్గం లేకపోవడం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొర వడటంతో బల్దియాలో అబివృద్ధి పనులు గాడి తప్పినట్లు ఆరోపణలు వినిపించాయి. ప్రత్యేక పాలనలో ప్రజలకు సకాలంలో సేవలు అందలేదని అభిప్రాయాలున్నాయి. అదే విధంగా పలు విభాగాల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు విమర్శలు సైతం వచ్చాయి.
కాగా ఇటీవల నూతన కౌన్సిల్ ఏర్పడింది. దీంతో కౌన్సిల్ సభ్యులు సమస్యల పరిష్కారం దిశగా ఏ విధంగా కృషి చేస్తారనే పట్టణ ప్రజలు గంపెడు ఆశతో ఎదురుచూస్తున్నారు. నూతన పాలకవర్గం 2026-- సంవత్సరానికి గాను బడ్జెట్ పై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ బడ్జెట్‌లో అబివృద్ధి పను లకు, మౌలిక వసతులకు ఏ మేరకు నిధులు కేటాయిస్తారో వేచి చూడాల్సిందే.
ప్రత్యేక పాలనలో సేవలు అంతంతే...
ఆదిలాబాద్ బల్దియాలో సుమారు రెండు ఏళ్ల పాటు పాలకులు లేక ప్రత్యేకాధికారుల పాలన కొనసాగింది. దీంతో అధికారులు సమస్యలపై అంతంత మాత్రంగానే దృష్టి సారించడంతో బల్దియా పాలన గాడి తప్పినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాయి.
ఆదిలా బాద్ మున్సిపాలిటీలోని పలు విభాగాల అధికారులు కార్యాలయంలో ప్రజలకు అందు బాటులో లేకపోవడం, సరిగ్గా విధులకు రాకపోవడం, పలువురు ఉద్యోగుల విధులకు రాకుండానే వేతనాలు పొందుతున్నట్లుగా విమర్శలు వచ్చాయి. అదేవిధంగా పలువురు ఉద్యోగులు ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శలు సైతం ఉన్నాయి. నూతన పాలకవర్గంలో ఇకనైనా వీటన్నిటికి చెక్ పడనుందా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బల్దియాలో అక్రమాలు ఆగేనా... ?
ఆదిలాబాద్ బల్దియాలో గత కొంతకాలంగా అక్రమాలు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలను ఎదుర్కొంది. కాగా ప్రత్యేక పాలనకు తెరపడిన నేపథ్యంలో నూతన కౌన్సిల్ అక్రమాలకు చెక్ పెట్టనుందా...? అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మున్సిపాలిటీలో కీలకమైన విభాగాలైనా పారిశుద్ధ్యం, ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగంలో కొంతమంది ఉద్యోగులు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శలున్నాయి. ఇలాంటి ఆక్రమ వ్యవహారాలను కట్టడి చేసేలా కొత్త పాలకవర్గం ఎలాంటి చర్యలు చేపడతారని పట్టణ ప్రజలు ఆశతో ఉన్నారు.
అక్రమాలను అరికడతాం
ఆదిలాబాద్ బల్దియాలో అవినీతి, అక్రమాలు జరగకుండా చూస్తాను. పారదర్శక పాలనను అందిస్తాను. త్వరలో అబివృద్ధి పనులకు రానున్న రూ.100 కోట్ల, మంచినీటి కోసం రూ. 54 కోట్ల నిధులతో ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ఆదిలాబాద్ పట్టణంలోని వార్డులను అభివృద్ధి చేస్తాం.
బల్దియాలోని ఇంజనీరింగ్, టౌన్ ప్లానిం గ్ విభాగంలో కొంతమంది అధికారులు బల్దియా ఆదాయానికి గండికొట్టి అవినీతికి పాల్పడినట్లు మా దృష్టికి వచ్చింది. వారిపై త్వరలో చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. వెనుకబడిన కాలనీలపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేస్తాం. ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ఆదిలాబాద్ పట్టణాన్ని మోడల్ సిటీగా చేస్తాను.
బండారి అనూష సతీష్, మున్సిపల్ చైర్‌పర్సన్




