రైతు భరోసా వస్తుందా!?
- వానాకాలం పెట్టుబడి సాయం కోసం ఎదురుచూపు
- దుక్కులు దున్ని సాగుకు సిద్ధమవుతున్న రైతులు
- 12 లక్షల ఎకరాల్లో సాగు అంచనా
- యాసంగిలో లక్షలాది మందికి అందని సాయం
సంగారెడ్డి, జూన్ 9(విజయక్రాంతి): వానాకాలం పంటల సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. భూములు దుక్కులు దున్ని, విత్తనాలు కొనుగోలు చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ సారి వర్షాలు ముందస్తుగానే కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. ఈ తరుణంలో అన్నదాతలు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం అందించే రైతు భరోసా కోసం ఆశగా చూస్తున్నారు.
ప్రభుత్వం గత యాసంగి సాయం రైతులకు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. అప్పుడు సాయం పొందని వారు... ఈ సారి రెండు సీజన్లవి కలిపి ఇస్తారా? ప్రస్తుతం వానాకాలానికే ఇస్తారా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
12 లక్షల ఎకరాల్లో సాగు అంచనా...
సంగారెడ్డి, మెదక్ జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో వరి, పత్తి, కంది, పెసర, జొన్న, మొక్కజొన్న.. ఇలా తదితర పంటలు 3.50 లక్షల ఎకరాల్లో సాగు చేస్తారని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. వీటికి అవసరమైన ఎరువులు తెప్పించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. పంట పెట్టుబడి సాయం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పేరుతో ఎకరాకు రూ.6 వేలు ప్రకటించిన విషయం తెలిసిందే.
గత యాసంగికి సంబంధించి జనవరి 26 నుంచి పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ చేయడం ప్రారంభించింది. ఎకరా, రెండు.. ఇలా విడతల వారీగా 5 ఎకరాలలోపు వరకు పెట్టుబడి సాయం అందించారు. ఆ తరువాత నుంచి ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం వానాకాలం వచ్చింది. ఈసారైనా పూర్తి స్థాయిలో సాయం అందుతుందా? లేదా? అన్నదాతలు మదనపడుతున్నారు.
సాయం అందని వారు చాలామందే...
మెదక్, సంగారెడ్డి జిల్లాలో రైతు భరోసా సాయం అందని వారు లక్షల్లో ఉన్నారు. ఒక్క మెదక్ జిల్లాను పరిశీలిస్తే 2.90 లక్షల మంది రైతులు రైతు భరోసా పొందుతుండగా.. వీరిలో గత యాసంగి సీజన్లో 2.27 లక్షల మంది రైతులకు పెట్టబడి సాయం అందింది. ఇంకా 63వేల మంది రైతులకు ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం రావాల్సి ఉంది. అలాగే సంగారెడ్డి జిల్లాలో సైతం లక్షకు పైగా రైతులకు రైతుసాయం అందలేదు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు విడతల వారీగా ప్రభుత్వం సాయం మంజూరు చేసింది. తరువాత నుంచి ఈ ప్రక్రియ నిలిచి పోయింది.
సాయం కోసం ఎదురుచూపులు...
వానాకాలం సాగుకు రైతులు సన్నద్దమవుతున్న తరుణంలో పెట్టుబడుల కోసం ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలోనే పెట్టుబడి సాయం వచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రైతు భరోసా డబ్బులు అందలేదని పలువురు రైతులు వాపోతున్నారు. వానాకాలం సాగుకు ప్రభుత్వం త్వరగా సాయం అందిస్తే ఎంతో మంది రైతులకు మేలు కలుగుతుందని భావిస్తున్నారు.






