4 May, 2026 | 7:20 PM

పోడు పరిష్కారం అయ్యేనా?

25-06-2024 05:24 AM
  • రెవెన్యూ, అటవీశాఖల మధ్య కొరవడిన సమన్వయం

రాజుకున్న రాజకీయ రంగు

రేంజ్‌కు 150 ఎకరాల స్వాధీనంపై  అధికారుల నజర్

ఆందోళనలో క్షేత్రస్థాయి అటవీ శాఖ సిబ్బంది

కుమ్రంభీం ఆసిఫాబాద్, జూన్24 (విజయక్రాంతి) : వానకాలం వచ్చిందంటే పోడు భూముల లొల్లి తెరపైకి వస్తుంది.  రైతులు, అటవీశాఖ అధికారుల మధ్య ఘర్షణలకు దారి తీస్తోంది. అటవీ భూముల్లో యేండ్లు గా వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు ఏటా సమస్యలతోనే సీజన్ మొదలవుతుంది. ప్రజాప్రతినిధులు, మంత్రులు, నాయకులు పోడు రైతులను ఇబ్బంది పెట్టొద్దని అటవీశాఖకు విజ్ఞప్తి  చేస్తూనే ఉన్నారు. కానీ, అటవీశాఖ అధికారుల తీరు ఆదివాసీగూడేల్లో కంటిమీద కనుకులేకుండా చేస్తోంది.  

వివాదాలకు నిలయంగా...

ఏటా పోడు రైతులకు యుద్ధం తప్పడం లేదు. ఇటీవల కాగజ్‌నగర్ మండలం అంకుశాపూర్ శివారులో 70 మంది రైతులు, ఫారెస్ట్ అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 35 యేండ్లకు సాగు చేస్తున్న వారిని అడ్డుకునేందుకు అధికారులు ప్రయ త్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవకు దారితీసింది. రూరల్ సీఐ రాంబాబు చొరవతో రైతులు శాంతించారు. ఆసిఫాబాద్ మండలందానపూర్‌లో  40 యేండ్లకుపైగా సాగులో ఉన్న భూములను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు రెండేళ్లుగా ప్రయ త్నిస్తున్నారు.

చింతలమానేపల్లి మండలం గూడెం, గంగాపూర్, ఖర్జెల్లి, కోసిని, ఆడేపల్లి, బెజ్జుర్ మండలం కొత్తగూడ, బెజ్జుర్, ఎల్కపల్లి, సులుగుపల్లి, సిద్దాపూర్, పాపన్‌పేట్ లోనూ పోడు ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కాగజ్‌నగర్ మండలం అరెగూడకు చెందిన రైతులు రెవెన్యూ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. రెబ్బెన మం డలం తుంగెడ శివారులో 42 ఎకరాల్లో సాగును అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. 12 మందిపై కేసుపెట్టడంతో రైతులు ఆగ్రహంతో ఉన్నారు.  

గతంలోనే పట్టాలు

గత ప్రభుత్వం అర్హులైన పోడు రైతులకు హక్కు పత్రాలను అందజేసింది.  రైతుబంధు కూడా అమలు చేసింది. జిల్లాలో 44,750 ఎకరాలకు సంబంధించి 15,254 మంది గిరిజనులకు పట్టాలు అందాయి. ఇక సమస్య పరిష్కరమైందనుకుంటే ఈ ఏడాది మళ్లీ లొల్లిమొదలైంది. గిరిజనేతరులకు పట్టాలివ్వకపోవడంతో అలజడులు రేగుతున్నాయి.  

మంత్రి అలా.. అధికారులు ఇలా 

పోడు రైతులకు అన్యాయం చేయవద్దని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సీతక్క అటవీశాఖ అధికారులకు సూచించారు. కానీ, అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నా రు. ప్రతి రేంజ్ పరిధిలో 150 ఎకరాలను స్వాధీనం చేసుకోవాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలివ్వడం ఆందోళనలకు దారితీస్తోంది.  

పోడు రైతులను ఆదుకోవాలి 

పోడు వ్యవసాయమే ఆధారంగా జీవి స్తున్న గిరిజనులను అటవీఅధికారులు వేధించడం సరికాదు. అడవుల రక్షణ పేరిట ఏటా ఇబ్బందులకు గురిచేయడం దారుణం. పోడు భూముల సమస్యను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కారం చూపాలి.

 కోట శ్రీనివాస్, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు