6 June, 2026 | 1:42 AM

సఖి కేంద్రం నుంచి మహిళ అదృశ్యం

06-06-2026 12:00 AM

భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు.. సిబ్బందికి నోటీసులు..

గద్వాల టౌన్, జూన్ 5: మహిళలు, బాలికల రక్షణ కోసం ఏర్పాటు చేసిన సఖి కేంద్రం నుంచి ఓ మహిళ అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గట్టు మండలానికి చెందిన మహిళ కేంద్రం నుంచి ఎవరికి తెలియకుండా వెళ్లిపోయినట్లు సమాచారం. సఖి కేంద్రం సిబ్బంది ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిసింది. ఈ ఘటనతో కేంద్రంలో భద్రతా ఏర్పాట్లు, పర్యవేక్షణ వ్యవస్థపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మహిళల రక్షణ, పునరావాసం లక్ష్యంగా పనిచేస్తున్న కేంద్రంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఆందోళనకు గురిచేస్తోందని స్థానికులు పేర్కొంటున్నారు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగినట్లు వారు చెబుతున్నారు. ఘటనపై స్పందించిన జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి సునంద విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందికి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టినట్లు, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.కేంద్రంలో భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయడంతో పాటు ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.