ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి
ఎంఈఓకు ఏబీవీపీ వినతి
పెబ్బేరు, జూన్ 5:ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించడంతో పాటు ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజులను నియంత్రించాలని కోరుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నాయకులు గురువారం మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) జయరాములకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ వనపర్తి జిల్లా కన్వీనర్ దేవర్ల కార్తీక్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత, ఉపాధ్యాయుల ఖాళీలు, తాగునీటి సమస్యలు, మరుగుదొడ్లు, ఫర్నిచర్ తదితర సౌకర్యాల లేమితో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన తొలి రోజునే విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, ఇతర విద్యా సామగ్రి అందేలా విద్యాశాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఫీజు నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేసి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత సీట్ల కేటాయింపును తప్పనిసరిగా అమలు చేసి, పేద మరియు బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఏబీవీపీ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివకుమార్, నగర కార్యదర్శి ఇటిక్యాల శివ, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.






