24-11-2025 04:27:30 PM
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్..
తరిగొప్పుల (విజయక్రాంతి): సోమవారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తరిగొప్పుల మండలంలో పలు తనిఖీలను నిర్వహించి, ఇందిరమ్మ చీరల పంపిణి కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా నర్సాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్న చీరల పంపిణి కార్యక్రమాన్ని పరిశీలించి.. ప్రతీ మహిళకి చీర అందాలని పంచాయతీ సెక్రటరికి కలెక్టర్ పలు సూచనలు చేసారు. అనంతరం అబ్దుల్ నాగారంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించి, పలు రిజిస్టర్ లను పరిశీలించారు. ఏ రోజుకి ఆ రోజు వచ్చిన ధాన్యాన్ని తేమ శాతం రాగానే కొనుగోలు జరగాలని.. ఎక్కువ రోజులు కేంద్రాలలో పెట్టుకొని రైతులకు ఇబ్బంది కలగజేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాలలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని కలెక్టర్ స్వయంగా రైతులను అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత గ్రామ పంచాయతీలో జరుగుతున్న చీరల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... మహిళలు గౌరవంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఇప్పటికే లక్షలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తున్నాయని వెల్లడించారు. మహిళల ఆదాయ వనరులను పెంపొందించేందుకు వడ్డీ లేని రుణాలు,యజమానులను చేసేందుకు ఆర్టీసీ బస్సులు, సోలార్ పవర్ ప్లాంట్లు, పెట్రోల్ పంపుల ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దీనితో వారి కుటుంబ ఆర్థిక స్థిరత్వం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మహిళలు ప్రభుత్వం అందిస్తున్న పథకాల ప్రయోజనాలను సద్వినియోగం చేసుకుని పొదుపు సంస్కృతిని, వ్యాపార లక్షనాలని పెంపొందించుకోవాలని కలెక్టర్ సూచించారు. చివరగా కేజీవీబీని సందర్శించి.. మధ్యాహ్న భోజనంకి ఉపయోగించే ప్రతీ వస్తువు ని కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్, మైపాల్ రెడ్డి ఎంపీడీఓ, లావణ్య, కార్యదర్శి రవీందర్, సిఏ స్వప్న, ఖాతా బాలయ్య, మహిళలు తదితరులు పాల్గొన్నారు.