మహిళలు ఆర్థికంగా ఎదగాలి
- బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
రాష్ట్ర మంత్రి సీతక్క
హైదరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): మహిళలు బ్యాంకులు ఇచ్చే రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు. చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థలో శనివారం జరిగిన సెర్ప్ వార్షిక రుణ ప్రణాళిక 202425 విడుదల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళలకు వడ్డీ లేని రుణాల క్రింద 2,53,864 సంఘాలకు రూ.264.35 కోట్లు డిసెంబర్ 2023 నుంచి మార్చి 2024 వరకు అడ్వాన్స్‌గా విడుదల చేసినట్లు తెలిపారు.
అంతేకాకుండా సంఘాలు, మహిళలకు రూ.10 లక్షల వరకు ప్రమాద బీమా, రూ.2 లక్షల వరకు క్రెడిట్ సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ కుట్టమని మహిళా సంఘాలకు అప్పగించినట్లు చెప్పారు. దీని ద్వారా వారికి రూ.50 కోట్ల ఆదాయం సమకూరుతుందన్నారు. మహిళలకు మరింత ఆర్థిక ప్రయోజనం చేకూర్చేలా సచివాలయం, కలెక్టరేట్లు, బస్టాం డ్లు, పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, పారిశ్రామిక ప్రాంతాల్లో మహిళా క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను తయారు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో గ్రామీణాభివృ ద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా పాల్గొన్నారు.






