30 June, 2026 | 2:19 AM

నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోకు

30-06-2026 01:35 AM

మాట ఇచ్చి మోసం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే.. 

టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

ఎల్బీనగర్, జూన్ 29 (విజయక్రాంతి): నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న రేవంత్‌రెడ్డి చరిత్రలో కనుమరుగుకాక తప్పదని తెలంగాణ రక్షణసేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. సోమవారం దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన నిరుద్యోగుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు ఇచ్చిన మాట మరిచి మోసం చేస్తున్నాడని విమర్శించారు. నిరుద్యోగులకు కానిస్టేబుల్ ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో 19200 పోలీస్ ఉద్యోగాలున్నాయని శ్వేతపత్రం ఇచ్చారు కదా మరి ఎందుకు మోసం చేస్తున్నారని ప్రశ్నించారు. తమ పార్టీ నిరుద్యోగులకు అండగా ఉంటుందని తెలిపారు. నేను అనుకొని ఏ పనైనా స్వీకరిస్తే పని అయిందాకా వదిలిపెట్టనని నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు కొట్లాడతానన్నారు.

ఏడాదికి రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవ్వడంలేదని రేవంత్‌ను గద్దెనెక్కించిన నిరుద్యోగులు తిరిగి గద్దె దించుతారని హెచ్చరిం చారు. జులై 2 న సెక్రటేరియట్ ముట్టడి చేస్తున్న నిరుద్యోగులతో తాము తెలంగాణ ఉద్యమకారులతో కలిసి నడుస్తామని పేర్కొన్నారు. 20 వేల పోలీస్ ఉద్యోగాలు సాధించే వరకు మీతో కలిసి నడుస్తా పిడికిలి ఎత్తి కొట్లాడతామని నిరుద్యోగులకు భరోసా కల్పించారు. ఈకార్యక్రమంలో టీఆర్‌ఎస్, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.