30 June, 2026 | 2:08 AM

ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ ఏఈఈ

30-06-2026 01:36 AM
  1. రూ.నాలుగు లక్షలు డిమాండ్ చేసిన ఇంజినీర్
  2. రూ.రెండు లక్షలు తీసుకుంటూ పట్టుబడిన ఉద్యోగి
  3. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఘటన 

అశ్వారావుపేట, జూన్ 29 ( విజయక్రాంతి) : ఓ రైతు నుంచి రెండు లక్షల రూపాయలను లంచంగా స్వీకరిస్తూ ఇరిగేషన్ శాఖకు చెందిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) ఎల్. శ్రీనివాస్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో సోమవా రం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల మేరకు అశ్వారావుపేట మండలంలోని దొంతికుంట చెరువు నుంచి శిఖం భూమిలో మట్టి తోలుకునేందుకు అనుమతి కోసం ఓ రైతు ఇరిగేషన్ విభాగానికి చెందిన ఏఈఈ శ్రీనివాస్‌ను సంప్రదించారు.

ఇందుకు రైతు నుంచి ఆ ఇంజనీర్ రూ.నాలుగు లక్షలను డిమాండ్ చేశాడు. దీంతో ఆ రైతు ఏసీబీ అధికారులను సంప్రదించగా వారు వలపన్ని ఏఈఈ శ్రీనివాస్ ఆయన కార్యాల యంలో రూ. రెండు లక్షలు స్వీకరిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏఈఈ శ్రీనివాస్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి, కోర్టుకు హాజరుపర్చనున్నట్లు సమాచారం. కాగా ఇదే రైతు గతంలోనూ విద్యుత్ శాఖకు చెందిన ఓ అసిస్టెంట్ ఇంజనీర్ ను ఏసీబీకి పట్టించినట్లు తెలుస్తోంది.