3 May, 2026 | 1:29 AM

ప్రకృతితో మమేకమవుదాం!

04-06-2024 12:05 AM

భూమి అంటే జీవం లేని మట్టికాదు. కోట్లాది సూక్ష్మజీవులు, లక్షలాది మొక్కలు, వాటి పెరుగుదలకు అవసరమైన పోషకాల సమ్మేళనం. మనిషికి, ప్రకృతికి అవినాభావ సంబంధం ఉంది. ప్రకృతి లేనిదే మానవ మనుగడ లేదు. అటువంటిది నేడు మనం ప్రకృతిని అనేక రకాలుగా ధ్వంసం చేస్తున్నాం. మనిషి స్వార్థ పరుడు. చెట్లను కొట్టేసి పక్షులకు గూళ్ళు లేకుండా, జంతువులకు నీడ లేకుండా చేస్తున్నాడు.

ప్రకృతి వనరుల దోపిడి

ప్రగతి పేరుతో ఫ్యాక్టరీలు పెట్టి అడ్డూ, అదుపు లేకుండా ప్రకృతి వనరుల్ని దోచేస్తున్నాడు. స్వచ్ఛమైన గాలి గుండెల నిండా పీల్చుకునే భాగ్యాన్నికూడా లేకుండా చేసుకుంటున్నాడు. నగరాలలో స్వచ్ఛమైన గాలి కరవవుతున్నది. గాలి పీల్చిన ప్రతిసారి మనం చిటికెడు కాలుష్యాన్ని ఊపిరి తిత్తుల్లో నింపుకున్నట్లే లెక్క. నగరీకరణ పెరగడంతో ఎయిర్ కండిషనర్లు, కూలర్లు, ఫ్రిడ్జ్‌లు వంటి విద్యుత్, ఎలక్ట్రానిక్ పరికరాలను వాడేవారి సంఖ్య ఎక్కువైంది. ఫలి తంగా గాలిలో క్లోరోఫ్లోరో, కార్బన్ వంటి వాయువుల వాటా పెరుగుతోంది. కర్బన ఉద్గారాలు పెరగడంవల్ల శ్వాసకోశ వ్యాధు లు, చర్మరోగాలు, మానసిక సమస్యలు వచ్చి పడుతున్నాయి. సుఖాల కోసం ఎదురుచూసే వారి సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల ప్రభుత్వాలు కల్పించే ప్రాథమిక సౌకర్యాలు అందరికీ అందడం లేదు. 

పెరుగుతున్న కాలుష్యం

అపరిశుభ్రమైన పరిసరాలు, ఆరోగ్య సమస్యల కారణంగా రోజురోజుకూ దారి ద్య్రం పెరిగిపోతోంది. ఉద్యోగాలు, ఉపాధి పనులను వెతుక్కుంటూ గ్రామీణ ప్రాంతా ల నుండి ప్రజలు పట్టణ ప్రాంతాలకు వలస రావడంతో ఉమ్మడి కుటుంబవ్యవస్థ దెబ్బ తినడమేకాక సౌకర్యాల లేమితో పట్టణాలు, నగరాలలో మురికివాడలు పెరిగిపోతున్నాయి. వీటివల్ల పర్యావరణంపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. కాగా, ప్రతి పనికి ఇంధన వనరులు అవసరం. వంటపనుల కోసం, యంత్రాల కోసం, వాహనాలు నడపడానికి, వ్యవసాయానికి, ఫ్యాక్టరీలు, గృహాలలో, విద్యుత్ అవసరాల కోసం.. ఇలా ప్రతి దానికీ ఇంధనం తప్పనిసరి అవుతున్నది.

ఆధునికీకరణలో భాగంగా పరిశ్రమలు పెరగడంతో ఇంధన వనరులు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. థర్మల్ విద్యుత్, జల విద్యుత్ తగినంతగా ఉత్పత్తి కావడం లేదు. పెరుగుతున్న జనాభాతో వాడకంపై మరింత ఒత్తిడి పెరుగుతోంది. దీంతో బొగ్గు, పెట్రోలియం, డీజిల్ నిల్వలు తగ్గిపోతున్నాయి. దీనికితోడు వీటి ఉత్పత్తి సమయంలో కాలుష్యమూ ఉత్పన్నమవుతున్నది. పరిశ్రమలు వేలాదిమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇవి వీలైనంత కాలుష్యాన్ని ఘన, ద్రవ, వాయు రూపాలలో చుట్టూ ఉన్న పరిసరాల్లోకి వదులుతున్నాయి. 

మూల వనరులకు మూలం

ప్రతి పరిశ్రమ ముడి పదార్థాలను ప్రకృతి నుండే తీసుకుంటుంది. ఉత్పత్తి క్రమంలో అవి కాలుష్యాన్ని ప్రవేశపెడుతున్నాయి. ఈ వ్యర్థాలు కొన్ని నీటిలో కరిగి రసాయనిక మురికినీరుగా, కొన్ని ఘనరూపంలోనే విష రసాయనాలుగా, మరికొన్ని రసాయనాలను కలియపెట్టినప్పుడు విష వాయువులుగా పరిశ్రమల చుట్టూ కమ్ముకుంటున్నాయి. అభివృద్ధి అనేది వినాశనా నికి దారి తీయరాదు. మరోవైపు ప్లాస్టిక్ వాడకమూ పర్యావరణాన్ని ఎంతగానో దెబ్బ తీస్తోంది. ప్లాస్టిక్ బ్యాగుల స్థానంలో కాగితం, బట్టతో తయారు చేసిన సంచులు వాడేలా మరింతగా ప్రోత్సహించాలి.

క్యారీ బ్యాగులు అందుబాటులోకి రాకముందు ఏ విధంగా సరుకులు తెచ్చుకునే వారో అదే పద్ధతిని పాటించాల్సిందిగా ప్రచారం చేయాలి. పర్యావరణ కాలుష్యంలో నీటి కాలుష్యం ప్రధానమైంది. మనం బతకడానికి నీరు అవసరం. భూమిమీద మూడు వంతులు నీరు, ఒక వంతు భూభాగం ఉన్న సంగతి తెలిసిందే. మూడు వంతుల నీళ్లు ఉన్నా మనకు ఉపయోగపడేది ఒక్క శాతం మాత్రమే. చెరువులు, నదులు, భూగర్భంలోని నీరు తాగేందుకు ఉపయోగపడుతున్నది. ఒకే ఒక్క భాగం నేలలో ఉన్న మూడు వంతులున్న నీటిని మనం కలుషితం చేస్తున్నాం. మంచినీటితోపాటు కోట్ల జీవులకు ఆవాసమైన సముద్ర జలాలనుకూడా మురికిమయం చేస్తున్నాం. 

ఆచరణాత్మక కృషి అవసరం

‘పర్యావరణ పరిరక్షణ’ అనేది వ్యక్తులు, సమూహాలు, ప్రభుత్వాల సమైక్య కృషితో జరగాలి. సహజ పర్యావరణాన్ని రక్షించే అభ్యాసం, సాధ్యమైన చోట నష్టాన్ని సరిచేయడం, ఆ పోకడలను తిప్పికొట్టడం పర్యావరణ దినోత్సవ లక్ష్యాలు కావాలి. అధిక వినియోగం, జనాభా పెరుగుదల, అలాగే సాంకేతికత ఒత్తిళ్ల కారణంగా బయో ఫిజికల్ వాతావరణం కొన్ని సార్లు శాశ్వతంగా క్షీణిస్తోంది. ఈ విషయా న్ని ప్రపంచం గుర్తించింది. అందుకే పర్యావరణ క్షీణతకు కారణమయ్యే కార్యకలాపా లపై ప్రభుత్వాలు ఆంక్షలు విధించడం ప్రారంభించాయి.

1960లనుండి పర్యావరణ ఉద్యమాలు బహుళ పర్యావరణ సమస్యలపై మరింత అవగాహనను కల్పించాయి. మానవ కార్యకలాపాలు, పర్యావర ణ ప్రభావం పరిధులపై భిన్నాభిప్రాయాలున్నాయి. కాబట్టి, ప్రభుత్వాలు తీసుకునే రక్షణ చర్యలు అప్పుడప్పుడు చర్చనీయాంశాలవుతాయి. పారిశ్రామిక దేశాల్లో స్వచ్ఛంద పర్యావరణ ఒప్పందాలు తరచుగా కనీస నియంత్రణ ప్రమాణాలు దాటి ముందుకు వెళ్లడానికి, గుర్తింపు పొందేందుకు ఒక వేదికను అందిస్తాయి. ఉత్తమ పర్యావరణ అభ్యాసం, అభివృద్ధికి దోహదపడతాయి.

భారతదేశంలో ‘ఎన్విరాన్‌మెంట్ ఇంప్రూవ్‌మెంట్ ట్రస్టు’ (ఈఐటీ) 1998 నుంచి పర్యావరణం, అట వీ సంరక్షణ కోసం పని చేస్తోంది. లాటిన్ అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ ఒప్పందాలు చాలావరకు హామీలకే పరిమితమవుతాయి తప్ప తప్పనిసరి నియంత్రణ ఉండదు. మానవ పర్యావరణంపై మైలురాయిగా పేర్కొనదగ్గ సమా వేశం 1972లో స్టాక్‌హోమ్‌లో జరిగింది. 

ఇది ఆరోగ్యకరమైన పర్యావరణానికి హక్కు భావనను స్థాపించింది. ఆ సంవత్సరం తర్వాత  ఐక్యరాజ్యసమితి పర్యావర ణ కార్యక్రమం రూపొందించబడింది. 1997 నాటి క్యోటో ప్రోటోకాల్, 2015 నాటి ‘పారిస్ ఒప్పందం’ వంటివి అత్యంత ప్రసిద్ధి చెందిన అంతర్జాతీయ ఒప్పందాల్లో ఉన్నాయి. 

పర్యావరణ అనుకూలమైన చర్యలు తీసుకోవడానికి, ప్రపంచ అవగాహనను పెంచడానికి ‘ఐక్యరాజ్యసమితి’ ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని’ ప్రతి ఏడాది జూన్ 5న జరపాలని నిర్ణయించింది. 

బాధ్యత ప్రతి ఒక్కరిదీ!

పర్యావరణం పరిశుభ్రంగా, ప్రకృతి పచ్చగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా చెట్లను పెంచాలి. దీని వల్ల ఈ సమస్యను కొంతవరకు నివారించవచ్చు. అలాగే, పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమంపై అవగాహన కల్పించాలి. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలి. ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాలి. ర్యాలీలు నిర్వహించి, అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం కలిగించాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం ‘హరితహారం’ పేరిట పెద్దఎత్తున మొక్కలు నాటడాన్ని ఉద్యమ స్థాయిలో చేపట్టింది. ఫలితంగా రాష్ట్రంలో పచ్చదనం గణనీయంగా పెరిగింది. 

దేశంలోని మిగతా రాష్ట్రాలుకూడా మొక్కలు నాటడాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నాయి. కానీ, మొక్కలు నాటడంపై చూపిస్తున్న ఉత్సాహం వాటిని పరిరక్షించడంపై చూపకపోవడం వల్ల నాటిన మొక్కల్లో సగం కూడా బతికి బట్ట కట్టడం లేదు. మరోవైపు భవనాల నిర్మాణం, రోడ్ల విస్తరణ పేరిట చెట్లను ఇష్టారాజ్యంగా నరికి వేస్తున్నారు. అధికారులు, స్వచ్ఛంద సంస్థలు ఈ దిశగా శ్రద్ధ చూపాలి. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ప్రకృతి ఎంత సహజంగా, ఎంత అందంగా ఉంటే మనకు అంత రక్షణ, సౌకర్యం లభిస్తాయి. ఇప్పటికైనా వాహనాల వాడకం తగ్గించి, మొక్కలు పెంచటం, చెరువులను కాపాడుకోవడం వంటివి చేయగలగాలి. మనంద రితో సహా జీవజాలానికి స్వచ్ఛమైన గాలి, నీరు అందేలా మన వంతు కృషి చేద్దాం. 

రేపు ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం’