వర్తమానంపై నమ్మకమే పునాది
గతం శోకో న కర్తవ్యం
భవిష్యతో నైవ చింతయేత్
వర్తమానేన కాలేన
ప్రవర్తన్తే విచక్షణాః
- చాణక్య నీతి
‘జరిగిపోయిన దాన్ని గురించి విచారించకు. గతం గతః అని దానిని విడిచిపెట్టు. ఇంకా, గతం గోష్ఠి నకర్తవ్యం. జరిగిన దాన్ని పట్టుకు వేళ్ళాడడం వల్ల ఉపయోగం ఉండదు. గతం ఒక చెల్లని చెక్కులాంటిది. దానిపై ఎంత సొమ్ము రాసి సంతకం చేసినా అది మనకు ఉపయోగపడదు. అయిన దానిని గురించి పట్టించుకుంటూ ‘అయ్యో ఇలా అయిందే, ఇలా కాక అలా చేసి ఉంటే బాగుండేది. అలా కాదు ఈ మాట అని ఉంటే బాగుండేది. ఇక్కడ కాదు మరోచోట మన డబ్బును దాచిఉంటే నష్టపోకుండా ఉండే వాళ్ళం కదా’ ఇలా చింతించడం వల్ల ప్రయోజనం శూన్యం. అలాగే, ఎప్పుడో ఏదో జరుగుతుందని భయపడడం లేదా సంతోష పడడం వల్ల కూడా ప్రయోజనం శూన్యం. జరుగుతుందో లేదో తెలియని దాన్ని గురించి ఊహించి వర్తమానాన్ని విస్మరించడం వల్ల దానిపై శ్రద్ధ తగ్గుతుంది. కాబట్టి, విజ్ఞులైన వారు వర్తమానాన్ని సంతోషంగా స్వీకరించాలి. సుఖవంతం చేసుకోవాలి. మార్చుకోగలిగినంతగా మార్చు కోవాలి” అంటారు చాణక్యులు.
కాలంతోపాటే మన ప్రయాణం
భూతకాలం లేదా గడచిపోయిన కాలం మనకు అనుభవాల్నిస్తుంది. కానీ, ఆ అనుభవాలు మన నిర్ణయాలపై ఆధారపడినవే కదా. తప్పుడు నిర్ణయాల ఫలితం తప్పుడుగానే ఉంటుం ది. అయితే, ఎవరైతే ‘అయ్యో తప్పుడు నిర్ణయల ద్వారా నష్ట పోయామని’ బాధ పడుతూ కూర్చుంటారో వారికి బాధ మాత్రమే మిగులుతుంది. అలాకాక, ఎవరైతే ఆ అనుభవాల ద్వారా పాఠాలను నేర్చుకొని జీవితానికి అన్వయించుకుంటారో వారే విజయాన్ని సాధిస్తారు. అదే జీవితం. ఒక బ్యాంక్ ఉంది. అది తన ఖాతాదారుల ఖాతా లో ప్రతి నిత్యం 86,400 రూపాయలు జమ చేస్తుంది. ఆ డబ్బును మీరు నిరభ్యంతరంగా మీ ఆలోచన ప్రకారం ప్రతి నిత్యం ఖర్చు చేసుకోవచ్చు.
కానీ, ప్రతి రోజు సాయంత్రం మీ ఖాతా సరిచూడబడి అందులో మీరు వాడని డబ్బు వెనుకకు మళ్ళించబడుతుంది. అలాగని, మీ అవసరా నికి ఆ 86,400లకు మించి తీసుకునే వెసులుబాటు కూడా ఉండదు. ఆ పరిస్థితులలో మీరు ఎలా ఆ డబ్బును వాడుతారు? మీ ప్రణాళిక ఎలా ఉంటుంది? ఆ 86,400 మనం ఒక రోజు గడిపే కాలం సెకన్లలో. ఆ సమయాన్ని ఎంత ప్రణాళికాబద్ధంగా, ఎంత సమర్థవంతంగా వినియోగించుకుంటే అంత ప్రశాంతంగా ఉండగలు గుతాం. అంతగా విజయ సాధకులమౌతాం. ఈ రోజుకు ఏది సరైంది, ఏది ముఖ్యమైంది అనేది విచారించి, చేసే ఉద్యోగాన్ని, జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ సమప్రాధాన్యతతో ముందుకు సాగే వారే అనుక్షణం ఆనందంగా ఉండగలుగుతారు.
ప్రతి రోజు ఉదయమే నిద్ర లేవగానే ఒక ప్రశ్న వేసుకోండి. ‘నా ప్రమేయం లేకుండా నాకు విజయం కాని అపజయం కాని సిద్ధిస్తుందా?’ అదే మన బతుకుకు లేదా జీవితానికి పునా ది అవుతుంది. జీవితాన్ని ఆస్వాదించాలి అంటే జీవన ప్రయోజనం ఏమి టి? అనేది అవగాహన కావాలి. దానికి తగిన ప్రణాళికలు రచించుకోవాలి. మనలో చాలామందిమి భగవంతుడిని నమ్ముతాం, ప్రార్థిస్తాం. కాని, చాలామందికి మన ప్రార్థన ఫలిస్తుందన్న నమ్మకం తక్కువ. ఇక నుండి ఆ ఆలోచన మానుకుందాం.
మన ప్రార్థన ఫలిస్తుందన్న నమ్మకంతో ఆరంభిద్దాం. ప్రయత్నించి విఫలమవడం ప్రయత్న హీనతకన్నా మంచిది. కనీసం, అనుభవమైనా వస్తుంది. ఎదుటివారిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిద్దాం. దానికి ముందు వారు ఏం చెపుతున్నారో శ్రద్ధగా విందాం. సాధించగలమనే నమ్మకం పెంచుకుందాం. అది మనం సాధించలేనిదైనా సరే, ప్రయత్నిద్దాం. సంకల్ప బలం ముందు కాలం కూడా దిగ తుడుపే. చివరగా, భవిష్యత్తు అనే ఆశల పల్లకిలో ఊరేగే దాని కన్నా ముందుగా వర్తమానాన్ని ఆస్వాదిద్దాం. ఆశలకన్నా ఆశయాలు గొప్ప వి. ఆశ వ్యక్తిగతం. ఆశయం సమష్టికి సంబంధించింది. ఆశయ సాధన వర్తమానంలోనే సాధ్యపడుతుంది.
-పాలకుర్తి రామమూర్తి






