25 April, 2026 | 3:16 PM

ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

25-04-2026 01:57 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ యెమీమా మాట్లాడుతూ మలేరియా వ్యాధి దోమ కాటు వల్ల వస్తుందని తెలిపారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, నిల్వ నీటిలో దోమలు వృద్ధి చెందే అవకాశముందని వివరించారు. అందువల్ల పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

అలాగే రాత్రి సమయంలో దోమతెరలు ఉపయోగించడం, పూర్తి చేతుల బట్టలు ధరించడం, చిన్నారులు, వృద్ధులను దోమల కాటు నుంచి రక్షించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పరిశుభ్రత పాటించడం ద్వారా మలేరియా మాత్రమే కాకుండా డెంగ్యూ, చికున్‌గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను కూడా అరికట్టవచ్చని పేర్కొన్నారు. ప్రజలు ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండి జ్వరం, వణుకు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని డాక్టర్ యెమీమా సూచించారు.ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.