18 July, 2026 | 3:50 PM

అవును.. దాడి చేసింది మేమే!

11-06-2024 02:08 AM

జమ్ము కశ్మీర్‌లో యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి

తామే చేసినట్టు ప్రకటించిన టీఆర్‌ఎఫ్ 

మరిన్ని దాడులు చేస్తామని హెచ్చరిక

అత్యాధునిక ఆయుధాలతో ఫైరింగ్

శ్రీనగర్, జూన్ 10: జమ్ము కశ్మీర్‌లోని రియాస్ జిల్లాలో 53 మంది ప్రయాణిస్తున్న యాత్రికుల బస్సుపై ఉగ్ర దాడికి పాల్పడింది తామేనని పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ది రెసిస్టెం ట్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్) ప్రకటించింది. భవిష్యత్తులో ఇలాంటి దాడులు మరిన్ని చేస్తామని హెచ్చరించింది. ఇది ప్రారంభం మాత్రమేనని, మున్ముందు మరిన్ని దాడులు చేస్తామని పేర్కొంది. ఈ దాడిలో 10 మంది యాత్రికులు చనిపోగా, 30 మందికి పైగా గాయపడ్డారు. యాత్రికులంతా యూపీ, రాజస్థాన్, ఢిల్లీకి చెందిన వారిగా గుర్తించారు.

రియాస్‌లోని శివ్‌ఖోరి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని కాత్రాలోని వైష్ణోదేవి ఆలయానికి వెళ్తున్న సమయంలో దాడి జరిగింది. దీంతో అదుపుతప్పి బస్సు లోయలో పడిపోయింది. బస్సుపై కాల్పులు జరిపిన దుండగులు పరారయ్యారు. ఉగ్రదాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం ఉగ్రవాదులను పట్టుకునేం దుకు గాలింపు చర్యలు చేపట్టింది. అయితే, దాడి జరిగిన ప్రాంతం చుట్టూ దట్టమైన అడవి, భారీ వృక్షాలు ఉండటంతో ఉగ్రవాదుల్ని పట్టుకునేందుకు డ్రోన్‌లను ఉపయోగిస్తున్నారు. ఎన్‌ఐఏ, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ బృందం దర్యాప్తు చేస్తోంది. దాడి ఘటనలో మూడు ఉగ్రవాద గ్రూపులు పాల్గొన్నాయని ఎన్‌ఐఏ గుర్తించింది. వీరిలో ఇద్దరు ఉగ్రవాదులు సమీపంలోని అటవీ ప్రాంతంలో తలదాచుకున్నట్లు అనుమానిస్తున్నారు.