08-01-2026 01:25:15 AM
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి
మహబూబ్ నగర్ రూరల్, జనవరి 7: డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ను విద్యార్థులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి సూచించారు. పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించి, ప్రతిష్ఠాత్మక ఐఐఐటి విద్యాసంస్థలో ప్రవేశాలు సాధించాలని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు. మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు మహబూబ్నగర్ గ్రామీణ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు కోటకదిర, మణికొండ, రాంచంద్రాపూర్, కోడూరు, గాజులపేట, ధర్మాపూర్, ఫత్తేపూర్ గ్రామాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆత్మీయ కానుకగా డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ను పంపిణీ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ పదవ తరగతి నుంచే స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని క్రమశిక్షణతో చదివితే ఐఐఐటి వంటి ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం సాధ్యమవుతుందన్నారు. ఆత్మీయ కానుకగా అందించిన మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విద్యాభివృద్ధే సమాజాభివృద్ధికి పునాది అని, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు మల్లు జగదీశ్వర్ రెడ్డి, కృష్ణయ్య, నర్సింహులు, రాజు గౌడ్, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రాములు, రవీందర్, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు.