12-07-2025 01:19:36 AM
కలెక్టర్ హనుమంతరావు
యాదాద్రి భువనగిరి జూలై 11 ( విజయ క్రాంతి ): యువత, విద్యార్థులు,ప్రజలు గంజాయి బారిన పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఎం.హనుమంత రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం రోజు జిల్లా లో గంజాయి నియంత్రణపై నిర్వహించిన సమావేశంలో డిప్యూటీ పోలీస్ కమిషనర్ అక్షాంక్ష్ యాదవ్ , అడిషనల్ డిసిపి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో గంజాయిపై ఉక్కుపాదం మోపాలని పోలీస్, ఎక్సైజ్, డ్రగ్స్‌ఇన్స్పెక్టర్, వైద్య, విద్యా, అటవీ, ఆర్టీసీ, సంబంధిత అధికారులను సమన్వయం చేసుకుంటూ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చాలని అన్నారు. జిల్లా లో అవగాహన సదస్సులు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు.గంజాయి మీద దృష్టి పెట్టి, యువతను, విద్యార్థులను గంజాయి, ఇతర మత్తు పదార్థాల నుండి కాపాడాలన్నారు.
యువత గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిస కాకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు., యువతకు వాటి వల్ల కలిగే నష్టాలపై వివరించాలని, ఎక్కువగా పాఠశాలలు, కళాశాలలు ఉన్న చోట నష్టాలపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని అన్నారు. పోలీస్ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎక్సైజ్ అధికారులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో లో చదివే పిల్లలకు డ్రగ్స్ పై వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించాలన్నారు. తెలంగాణ సాంస్కృతిక కళాకారుల ద్వారా గంజాయి పై గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. డిప్యూటీ పోలీస్ కమిషనర్ అక్షాంక్ష్ యాదవ్ మాట్లడుతూ..
సంబంధిత అధికారులు అందరూ కార్యచరణ ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు డ్రగ్స్ నియంత్రణలో పోలీస్ శాఖ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ల వద్ద గట్టి నిఘా ఉంచామని తెలిపారు. జిల్లా లోని పాఠశాలలు, కళాశాలల్లో, గంజాయి, మత్తు పదార్థాల వలన కలిగే నష్టాలపై యువతకు అవగాహన సదస్సులు నిర్వహించాలని అన్నారు.
జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లా గా తీర్చిదిద్దేందుకు సమాచారం అందించడంలో ప్రతి ఒక్కరి సహకారం అవసరం అన్నారు. కార్యక్రమంలో భువనగిరి, రెవిన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి,శేఖర్ రెడ్డి, ఎక్సైజ్ సూపర్నెంట్ విష్ణుమూర్తి, జిల్లా అటవీశాఖ అధికారి పద్మజ, జిల్లా అధికారి మనో , సంబంధిత అధికారులు పాల్గొన్నారు.