calender_icon.png 12 July, 2025 | 6:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీపీపీ తప్పుల తడక

12-07-2025 01:18:31 AM

  1. పవర్ కాదు.. కవర్ పాయింట్ ప్రజెంటేషన్ 
  2. దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టండి 
  3. కమిషన్‌ను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుంది 
  4. ఘోష్ కమిషన్‌కు అదనపు సమాచారం అందించాం: మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చింది పవర్ పాయింట్ ప్రజెంటేషన్(పీపీపీ) కాదని, 50 ఏండ్ల కాంగ్రెస్ ద్రోహ చరిత్రకు కవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. అజ్ఞానం, అహంకారం తో రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్లు మాట్లాడారని తెలిపారు. 299:512 ప్రకారం ఏపీతో శాశ్వత ఒప్పందం చేసుకున్నారని పదే పదే అబద్ధ్దం చెప్పడం సిగ్గుచేటన్నారు.

తాత్కాలిక నీటి వినియోగం, నీటి పంపకానికి తేడా తెల్వకుండా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నీటి వినియోగం కేఆర్‌ఎంబీ చేస్తుందని, నీటి పంపకం ట్రిబ్యునల్ చేస్తుందని వివరించారు. గోదావరిలో 968 టీఎంసీలు ఇచ్చింది కాంగ్రెస్ అని గొప్పలు చెబుతున్న రేవంత్‌రెడ్డి, కృష్ణాలో 299 ఇచ్చి అన్యాయం చేసిన విషయం ఎందుకు దాచి పెడుతున్నారని ఆయన ప్రశ్నించా రు.

సెక్షన్ 3 కింద నీళ్లు పంపిణీ చేయాలని, ఉమాభారతి, గడ్కరీ, షెకావత్, ప్రధానిని కలిసి, సుప్రీంకోర్టు గడప తొక్కి, నిర్విరామ పోరాటం చేసి కేసీఆర్ సెక్షన్ 3ని సాధించారని గుర్తు చేశారు. రేవంత్ ప్రభుత్వం వచ్చి 20 నెలలు అయ్యిందని, 299 టీఎంసీలు చాలని 2025లో మీరెందుకు సంతకాలు పెట్టారని ఆయన ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీరుతో తెలంగాణ రాష్ట్రం పరువుపోతుందని అన్నారు.

శుక్రవారం జస్టిస్ పీసీ ఘోస్ కమిషన్‌కు అదనపు సమాచారం అందించిన అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడా రు. కేసీఆర్‌కు వైద్య పరీక్షలు ఉన్న నేపథ్యం లో గురువారం కమిషన్ ముందుకు రాలేపోయానని తెలిపారు. మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను దృష్టిలో పెట్టుకొని తమ వద్ద ఉన్నంత మేర సమాచారాన్ని కమిషన్‌కు సమర్పించినట్టు పేర్కొన్నారు.

తాము ఇప్పుడు ప్రభుత్వంలో లేమని, డాక్యుమెంట్స్ అన్ని ప్రభుత్వం వద్ద ఉన్నాయని చెప్పారు. పూర్తి సమాచారం కోసం చీఫ్ సెక్రెటరీ, జీఏడీ సెక్రెటరీ, ఇరిగేషన్ సెక్రెట్రరీ గారికి లేఖ రాశానని, ప్రాజెక్టు సమయంలో క్యాబినెట్ నిర్ణయాలు, క్యాబినెట్ నోట్ వంటి సమాచారం కావాలని కోరినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. 

ఆరుసార్లు క్యాబినెట్.. మూడుసార్లు అసెంబ్లీ ఆమోదం

తమ వద్ద ఉన్న సమాచారం అధారంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి ఆరు సార్లు క్యాబినెట్ ఆమో దం పొందిన డాక్యుమెంట్లు, మూడుసార్లు అసెంబ్లీ ఆమోదం కూడా పొందిందని, జరిగిన చర్చ, ఇతర అంశాలను కమిషన్‌కు అం దించినట్టు వెల్లడించారు.

కమిషన్ ఆన్ గోయింగ్ కనుక ఆ వివరాలు బయట పెట్టలేనని,సందర్భం వచ్చినప్పుడు పూర్తిగా వివ రాలు బయట పెడతామని స్పష్టం చేశారు. పారదర్శకంగా ఉండాలనుకుంటే తమకు ఆ వివరాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కమిషన్‌ను తప్పుదోవ పట్టించేలా వివరాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందనే అనుమానంగా ఉందన్నారు.

 సీఎం రేవంత్‌రెడ్డి అజ్ఞాని

సీఎం రేవంత్‌రెడి తెలంగాణకు ఉపకారం చేసే మంచి బుద్దితో నడుచుకోవాలని హిత వు పలికారు. గోదావరిలో 1000 టీఎంసీలు, కృష్ణలో 500 టీఎంసీలు ఇచ్చి ఎన్ని నీళ్లున్నా తీసుకుపోవాలని చంద్రబాబుకు రేవంత్‌రెడ్డి ఆఫర్ ఇచ్చారని, ఇది అజ్ఞానం కాదా అని ప్రశ్నించారు. గోదావరిలో మన వాటా 1000 కాదని, 2,918 కావాలని కేసీఆర్ అడిగారని గుర్తు చేశారు. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మన నీటి హక్కుల గురించి తెలవక పోవడం బాధాకరమన్నారు.

కృష్ణాలో ఒకవైపు 763 టీఎంసీల కోసం పోరాటం చేస్తుంటే, ఉత్తం మొన్న 573 టీఎంసీలు చాలని అంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చెప్పినట్లు పని చేస్తున్నారా లేక రాష్ర్టం కోసం పని చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఉమ్మడి ఏపీలో 54లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చామని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారని, నిజాంలు కట్టిన ప్రాజెక్టులు కూడా వారి ఖాతాలోనే వేసుకున్నారని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి అతి తెలివితో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. 

  అసెంబ్లీలో చర్చ పెట్టండి

తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, దమ్ముంటే మీకు నచ్చిన తేదీల్లో అసెంబ్లీలో చర్చ పెట్టాలని ఆయన సవాల్ విసిరారు. కా నీ మైక్ కట్ చేయొద్దు, అసెంబ్లీ వాయిదా వే సుకొని పారిపోవద్దని షరతు పెట్టారు. ఎన్ని రోజులైనా, ఎన్ని గంటలైనా చర్చించేందుకు సిద్ధమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి 20 నెలల్లో ఒక్క చెరువు తవ్వలేదు, ఒక్క చెక్ డ్యాం కట్టలేదు, ఒక్క ప్రాజెక్టు కట్టలేదని విమర్శించా రు.

నాడు నేడు ఎప్పుడైనా పాపం కాంగ్రెస్ పార్టీదేనని ఆయన మండిపడ్డారు. కృష్ణాలో ఉన్న 34 శాతం నీటి వాటాలో గతేడాది 28 శాతమే వాడారని, ఆరున్నర లక్షల ఎకరాలు సాగయ్యే 65 టీఎంసీలను ఆంధ్రాకు, చంద్రబాబుకు గురు దక్షిణ చెల్లించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి నీళ్లు వదలడం మీ వైఫ ల్యం కాదా అని హరీశ్‌రావు ప్రశ్నించారు.