1 August, 2026 | 1:23 AM

గచ్చిబౌలిలో యువకుడి ఆత్మహత్య

01-08-2026 12:27 AM

శేరిలింగంపల్లి, జూలై 31 (విజయక్రాంతి): గచ్చిబౌలి ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్లో నివసిస్తున్న యువకుడు గురువారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. పోలీసు వర్గాల ప్రకారం, వాసవి జీపీ ట్రెండ్స్ అపార్ట్మెంట్స్లోని 1702వ నంబర్ ఫ్లాట్లో నివాసమున్న సుజీత్ కుమార్ పాండిట్ గురువారం సాయంత్రం సుమారు 4.30 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని అతని ఫ్లాట్మేట్లు హర్ష, అభినందిని మృతుడి అన్న అజిత్ కుమార్ పాండిట్కు తెలియజేశారు.

బెంగళూరులోని ఎస్జీ పాల్యా వెంకటేశ్వర లేఅవుట్లో ఉన్న అజిత్ కుమార్ పాండిట్ సమాచారం అందుకున్న వెంటనే హైదరాబాద్కు చేరుకుని అదే రోజు రాత్రి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చట్టపరమైన ప్రక్రియలు పూర్తయిన తర్వాత మృతదేహాన్ని అంత్యక్రియల కోసం స్వస్థలమైన ఝార్ఖండ్ రాష్ట్రంలోని బొకారో స్టీల్ సిటీ సెక్టార్-2కు తరలించేందుకు అనుమతి ఇవ్వాలని కుటుంబ సభ్యులు పోలీసులను కోరారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల నుంచి విచారణ కొనసాగిస్తున్నారు.