18-11-2025 01:53:11 PM
జూనియర్ కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
పాపన్నపేట,(విజయక్రాంతి): మాదకాద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, కెరీర్ పైన ఫోకస్ చేయాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నర్సింలు సూచించారు. మంగళవారం పాపన్నపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మాదకద్రవ్యాలు, బాల్య వివాహాలకు సంబంధించిన విషయాల పట్ల జిల్లా ఐసిడిఎస్ సూపర్వైజర్ మంజుల, ఎంపీడీవో విష్ణువర్ధన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ, మాదకద్రవ్యాల పైన ప్రతిజ్ఞ చేయించారు.
ఐసిడిఎస్ సూపర్వైజర్ మంజుల మాట్లాడుతూ.. బాల్యవివాహాల వల్ల కలిగే నష్టాలను వివరించారు. కౌమార దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను విద్యార్థులకు వివరించారు. యుక్తవయస్సులో ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా చదువు పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. అనంతరం యాంటీ డ్రగ్స్ కు సంబంధించిన విషయాలను ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్టూడెంట్ కౌన్సిలర్ సంతోష్ కుమార్, అధ్యాపక బృందం, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.