18-11-2025 02:28:54 PM
విజయవాడలో మావోయిస్టల కలకలం
27 మంది మావోయిస్టులు అరెస్ట్
అమరావతి: విజయవాడలో(Vijayawada) మావోయిస్టుల కలకలం రేగింది. కానూరు కొత్త ఆటోనగర్ లో ఛత్తీస్‌గఢ్ కు చెందిన 27 మంది మావోయిస్టులను అరెస్ట్(Maoist Arrest) చేశారు. కానూరులో అరెస్టు అయిన మావోయిస్టుల్లో 12 మంది మహిళలు, నలుగురు కీలక నేతలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఛత్తీస్ గఢ్ నుంచి వచ్చిన మావోయిస్టులు ఆటోనగర్ లోని ఒక భవనాన్ని షెల్టర్ జోన్ గా మార్చుకున్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో ఆపరేషన్ కొనసాగుతోంది. మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో దొరికిన డైరీతో వీరి సమాచారం తెలిసినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఒక మహిళ ఆధ్వర్యంలో మావోయిస్టుల కోసం షెల్టర్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. స్థానిక పోలీసుల సాయంతో ఆక్టోపస్ బలగాలు మావోయిస్టులను అరెస్ట్ చేశాయి. నాలుగు చోట్లు డంప్ లు ఏర్పాటు చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. మావోయిస్టుల డంప్ ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆటోనగర్ లో ఆక్టోపస్ బృందాల తనిఖీలు కొనసాగుతున్నాయి. మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఏపీ పోలీసుల నోట్ విడుదల చేశారు. ఛత్తీస్‌గఢ్ లో మావోయిస్టుల కదలికపై నిఘా పెరగడంతో ఏపీలో తలదాచుకునేందుకు హిడ్మా బృందం వస్తుందని తెలియడంతో నిఘా పెంచామని పోలీసులు చెప్పారు. మంగళవారం కూంబింగ్ చేపట్టడంతో ఎదురుకాల్పుల్లో హిడ్మాతో సహా ఆరుగురు మృతి చెందినట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు.
