18-11-2025 01:08:28 PM
కోదాడ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
పోలీసుల చిత్రహింసల వలనే చనిపోయారంటూ ఆరోపిస్తున్న బంధువులు
కొనసాగుతున్న ఉద్రిక్తత...
నచ్చచెప్పేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు...
కోదాడ: సూర్యాపేట జిల్లా చిలుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రిమాండ్‌లో ఉన్న కర్ల రాజేష్ (30) అనారోగ్యంతో మృతిచెందిన ఘటనపై స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజేష్ మృతి పోలీసుల చిత్రహింసల వలన జరిగిందంటూ అతని బంధువులు, ఎస్సీ కాలనీకి చెందిన వందలాది మంది ప్రజలు పట్టణ పోలీస్ స్టేషన్‌కు ర్యాలీగా వెళ్లి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ... సీఎంఆర్ఎఫ్ చెక్ కేసులో ఈనెల 4వ తారీఖున రాజేష్ ను చిలుకూరు పోలీసులు విచారణకు పిలిచి 10వ తారీఖున రిమాండ్కు పంపించారని, అప్పటివరకు పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టారని రాజేష్ తరపు బంధువులు ఆందోళనకు దిగారు.
15వ తారీఖున హుజూర్నగర్ సబ్‌జైలుకు తరలించారు. రిమాండ్‌లో ఉండగానే ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించినా వైద్యం ఫలించక మృతి చెందాడు.. అరెస్టు నుంచి రిమాండ్ వరకు రాజేష్‌పై జరిగిన వ్యవహారాలపై పాక్షికత ఉందని వారు ఆరోపించారు.పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత నెలకొనగా, డీఎస్పీ అక్కడికి చేరుకుని బంధువులతో చర్చలు జరుపుతున్నారు. రాజేష్ మృతి పరిస్థితులను పూర్తిగా విచారిస్తామని, అవసరమైతే మేజిస్ట్రియల్ ఇన్క్వైరీ కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు పోలీసులు రాజేష్‌ను ఎందుకు సమయానికి సరైన వైద్యం అందించలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం పట్టణంలో పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ, గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. రాజేష్ మృతిపై పోలీసులు పూర్తి నివేదిక ఇవ్వాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.