వ్యక్తి దారుణ హత్య
ములుగు, ఆగస్టు 13 (విజయక్రాంతి): ములుగు జిల్లా మంగపేట, ఏటూరు నాగారం మండల సరిహద్దులో బుధవారం రాత్రి నరసింహసాగర్ గ్రామపంచాయతీ పరిధిలోని గొందిగూడెం గ్రామానికి చెందిన తాటి శశి కుమార్ (32) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. గొందిగూడెం గ్రామానికి చెందిన తాటి శశి కుమార్ కమలాపురంకి చెందిన ఓ రైతు వద్ద పని చేస్తూ వ్యవసాయ పొలంలోని ఉన్న పెంకుటిల్లులో ఉంటున్నాడు.
అదే రైతు వద్ద మండలంలోని పూరేడుపల్లి గ్రామానికి చెందిన కొప్పుల నరసింహారావు, కొప్పుల లక్ష్మి అనే భార్యాభర్తలిద్దరూ పని చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి కొప్పుల నరసింహారావు, కొప్పుల లక్ష్మి దంపతులకు తాటి శశి కుమార్ మధ్య గొడవ జరిగింది. ఆ గొడవలో కొప్పుల నరసింహారావు తాటి శశి కుమార్ పై గొడ్డలితో దాడి చేయడంతో తాటి శశి కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు.
అనంతరం కొప్పుల నరసింహారావు, కొప్పుల లక్ష్మి దంపతులు ఇద్దరూ పారిపోయారు. గురువారం ఉదయం సమాచారం తెలుసుకున్న మంగపేట ఎస్త్స్ర టివిఆర్ సూరి ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ఏటూరునాగారం సిఐ సూర్య ప్రకాష్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏటూరునాగారం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. మృతుడు తాటి శశి కుమార్ కు భార్య రాధిక, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.






