రానున్నది బీజేపీ సర్కార్

04-11-2026 | 05:40am

నిర్మల్‌లో బీజేపీ మహా పాదయాత్ర

‘సర్’పై ఇండియా కూటమి దుష్ప్రచారం

దేశంలో చొరబాటుదారులకు కాంగ్రెస్ అండగా ఉంటదా?

కాంగ్రెస్ ఇలాగే మాట్లాడితే.. ఎన్‌ఆర్సీ కూడా అమలుచేస్తాం: కేంద్రమంత్రి బండి సంజయ్

పాదయాత్రకు భారీగా కదిలివచ్చిన కాషాయదండు

నిర్మల్ నవంబర్ ౩ (విజయక్రాంతి): రాష్ట్రంలో అగ్లీ సర్కార్ బీజేపీ బనేగా అంటూ ఆ పార్టీ నేతలు ముక్తకంఠంతో నినదించారు. దేశంలో దొంగ ఓట్లు(Bogus votes), చొరబాటు ఓట్లను తొలగిస్తే కాంగ్రెస్ ఇండియా కూటమి(Congress INDIA alliance) దుష్ప్రచారం చేస్తున్నదని దుయ్యబట్టా రు. ప్రజాస్వామ్య పరిరక్షణకు రాహుల్ గాంధీ(Rahul Gandhi) మద్దతిస్తారా.. దేశంలో చొరబడి దొంగ ఓట్లతో చలామణి అవుతున్న ఓటర్లకు మద్దతిస్తారా? స్పష్టం చేయాలని బీజేపీ చీఫ్ రామచంద్రరావు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay), బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి(Alleti Maheshwar Reddy), ఎంపీ ఈటల రాజేందర్ సూటిగా ప్రశ్నించారు.

మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో.. కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి ఎస్‌ఐఆర్‌పై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుతూ బీజేపీ మహా పాదయాత్ర నిర్వహించింది. ఈ మహా పాదయాత్రలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్‌చార్జీ సునీ ల్ బన్సల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు పన్నినా వచ్చే ఎన్నికల్లో.. తెలంగాణ ఇన్‌చార్జీ బన్సల్ నేతృత్వంలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ బోతుందని నేతలు ముక్తకంఠంతో వెల్లడించారు.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బన్సల్ ఇన్‌చార్జ్జీగా ఉన్న బెంగాల్, యూపీలో బీజేపీ అధికారులకు వచ్చిందని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో రాబోతుందని స్పష్టంచేశారు. నిర్మల్ పట్టణంలోని శాంతినగర్ చౌరస్తా నుంచి ప్రారంభమైన మహా పాదయాత్ర మారెమ్మ టెంపుల్, శివాజీ చౌక్, బస్ డిపో, చైన్ గేట్ మీదుగా వివేక్ చౌరస్తా వరకు కొనసాగింది.

బీజేపీ మహాపాదయాత్ర సందర్బంగా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, పెద్దసంఖ్యలో కార్యకర్తలు పాల్గొనడంతో నిర్మల్ జిల్లా కేంద్రం కాషాయ జెండాలతో కళకళలాడింది. ఒకవైపు వర్షం కురుస్తున్నా, జనం ఈ పాదయాత్రలో పెద్దఎత్తున పాల్గొని ‘సర్’కు అనుకూలంగా నినాదాలు చేస్తూ.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేది బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీయేనంటూ నినదించారు. 

చొరబాటుదారులకు సమర్థిస్తారా: బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్‌రావు 

దేశ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తే కాంగ్రెస్ ఇండియా కూటమి ‘సర్’ను వ్యతిరేకిస్తూ ప్రజా ఆందోళనలు చేపట్టడం వెనుక అర్థం ఏమిటని బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్ర రావు ధ్వజమెత్తారు. దేశంలో ఓటరు జాబితాలో చనిపోయినవారు, రెండు చోట్ల ఓట్లు ఉన్నవారు, క్రమంగా వలస వచ్చి ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్న ఓట్లను తొలగించేందుకు ఎస్‌ఐఆర్ ప్రక్రియ చేపడుతుంటే, దాన్ని జీర్ణించుకోలేని ఇండియా కూటమి దేశంలో ఉద్యమాలు చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నదని అన్నారు.

రాహుల్ గాంధీ  ఎస్‌ఐఆర్ వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం.. చొరబాటుదారులకు, అక్రమ ఓటర్లకు అండగా ఉంటుందన్న సాంకేతాన్ని ఇస్తుండగా.. దానిని ఆ కూటమి సమర్థిస్తుందా అని సూటిగా ప్రశ్నించారు. ఎస్‌ఐఆర్ వల్లనే దేశంలో బీజేపీ గెలుస్తుందని కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని.. తమిళనాడు, తెలంగాణ, కేరళంలో ఎస్‌ఐఆర్ పనిచేస్తుంటే కాంగ్రెస్ ఎట్లా గెలిచేదని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి రాష్ట్రాన్ని దోచిన మూటలుగా ఢిల్లీకి తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు.  

గుండెచప్పుడు మోదీ: మహేశ్వర్‌రెడ్డి

ప్రపంచ దేశాల్లోని భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలిపిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రజల గుండె చప్పుడు అని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి అన్నారు. నిర్మల్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా మండిపడ్డారు. ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఇటీవలే ఢిల్లీలో చేపట్టిన నిరసన అట్టర్ ప్లాప్ అయిందని, అదే హైదరాబాద్‌లో అమిత్ షా, నిర్మల్‌లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బన్సల్ నేతృత్వంలో చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ పాదయాత్ర విజయవంతమైందని అన్నారు. ఓటు  చోరీ అంటూ ఇండియా కూటమి ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలకమైన ఓటు హక్కుపై దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటు అన్నారు.

రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా బన్సీలాల్ నేతృత్వంలో తమ పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో రాహుల్ గాంధీకి మూటలను తీసుకెళ్లి తన పదవిని కాపాడుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్, ప్రస్తుతం అధికారులు ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలను వంచించిందని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేని ఈ సర్కార్‌కు పాలించే అర్హత లేదన్నారు. రాష్ట్రంలో రైతులు, మహిళలు, ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. 

13 ఓట్లు కూడా పోలేదు: కేంద్ర మంత్రి బండి సంజయ్

సోషల్ మీడియాలో బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్న వారి బట్టలూడగోడతామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. ఈ దేశం కానోడి ఓటు, అక్రమంగా చొరబడ్డోడి ఓటు తప్పకుండా తొలగిస్తామని ఆయన అన్నారు. ‘సర్’ గురించి కాంగ్రెస్ ఇలాగే మాట్లాడితే ఎన్‌ఆర్సీ (జాతీయ పౌర పట్టిక) కూడా అమలు చేస్తామని, అక్రమంగా వలస వచ్చిన పరాయి దేశస్థులను తరిమికొడతామని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దేశంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఒకే ఓటు అనే సిద్ధాంతంతో బీజేపీ సర్ ప్రక్రియను చేపడితే కాంగ్రెస్ ఐక్యకూటమి దాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం చేయడం ప్రజాస్వామ్య ఓటు హక్కును ఖూనీ చేయడమేనన్నారు. దేశంలో 13 కోట్ల ఓట్లను తొలగించారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారని, అర్హతగల 13 ఓట్లు కూడా తొలగిస్తే బీజేపీ దేనికైనా సిద్ధమన్నారు. దేశంలో అక్రమ చొరబాటుదారుల ఓట్లు, మరణించినవారి ఓట్లు, ఒక వ్యక్తికి వేరే వేరే ప్రాంతాల్లో ఉన్న ఓట్లు తొలగిస్తే అది ఓటు చోరీ అంటూ కాంగ్రెస్ నేతలు ఉద్యమం చేయడం సిగ్గుచేటు అన్నారు.

దేశంలో 6.40 కోట్ల వలసదారులకు ఓట్లు ఉండవని గుర్తు చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారులు ఉన్నప్పుడు 12 సార్లు ఎస్‌ఐఆర్ ప్రక్రియ సమర్థించి ఇప్పుడు వ్యతిరేకించడం చొరపాటుదారులకు అక్రమ ఓటర్లకు వారు అండగా ఉంటున్న విషయం దేశ ప్రజలకు తెలుసని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన పూర్తి వైఫల్యం చెందిందని రాహుల్ గాంధీ చుట్టూ ప్రదక్షిణలు చేసి తన పదవిని కాపాడుకుంటున్న సీఎం ప్రజల పాలనను పూర్తిగా విస్మరిస్తున్నారని ఆరోపించారు.

దేశంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని ఈ విషయాన్ని ప్రపంచ దేశాలు గుర్తిస్తే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకు ఎంతో విలువుందని, దాన్ని వ్యతిరేకిస్తే ప్రజలు బట్టలు విప్పి కొట్టే రోజులు దగ్గర పడతాయని అన్నారు. 

తెలంగాణలో బీజేపీ సర్కార్: ఈటల 

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలన అంతం అయ్యిందని సీఎం రేవంత్ రెడ్డి పాలన రెండేళ్లలో పూర్తయితుందని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ పాలన రాష్ట్రాన్ని పరుగులు పెట్టించనుందని మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ, సీనియర్ నేత ఈటెల రాజేందర్ అన్నారు. నిర్మల్ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ జాతి ప్రజలు గౌరవించే ముద్దుబిడ్డ అని తెలిపారు. 70 సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ దేశ అభ్యున్నతిలో ఏం సాధించింది ప్రజలకు తెలుసని నరేంద్ర మోదీ పదేళ్ల పాలల్లో ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు.

డబుల్ ఇంజన్ సర్కార్ తోని ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ, సోనియాగాంధీ, ఖర్గే వంటి అగ్రనేతలు సర్ వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టడం ఓటుకున్న విలువను తగ్గిస్తుంది అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని, ఆరు గ్యారెంటీలు 420 హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. హామీల అమలకు రాష్ట్రంలో బీజేపీ త్వరలో ప్రజా చైతన్య యాత్ర నిర్వహిస్తుందని తెలిపారు.

తెలంగాణలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దోచుకుని దాసుకుంటున్నారని.. దాచుకున్న సొమ్మును బీజేపీ అధికారంలోకి రాగానే కక్కిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ జీ నాగేష్, ఎమ్మెల్యేలు పవార్ రామారావు పాటిల్, పాయల్ శంకర్, పాల్వాయి హరీష్ బాబు, రాకేష్ రెడ్డి, ధనపాల్ సూర్యనారాయణ గుప్తా, ఎమ్మెల్సీలు మల్కా కొమురయ్య, అంజిరెడ్డి, జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్, బీజేపీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర బీజేపీ సహ ఇన్‌చార్జీ రేఖ శర్మ, అభయ్ పాటిల్ కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. 

సీఎం అంటే మాట్లాడటం మానేస్తా

నిర్మల్ సభలో బండి సంజయ్ 

నిర్మల్ నవంబర్ 3 (విజయక్రాంతి): బీజేపీ నిర్మల్‌లో నిర్వహించిన మహా పాదయాత్రలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. స్థానిక వివేకా చౌరస్తాలో బీజేపీ అగ్రనేతలతో పాల్గొన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కి మైకు ఇచ్చారు. బండి సంజయ్ మైక్ అందుకొని ప్రసంగం ప్రారంభించగానే వేదిక ముందు ఉన్న యువకులు పెద్దఎత్తున సీఎం, సీఎం అంటూ నినాదాలు చేశారు.

వెంటనే స్పందించిన బండి సంజయ్ మీరు సీఎం అని అంటే నేను మైక్ బంద్ చేసి, మాట్లాడడం మానేస్తా అని చెప్పడంతో అక్కడున్న కార్యకర్తలంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత బండి సంజయ్ సర్‌పై కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళన, ప్రజాస్వామ్య పరిరక్షణకు బీజేపీ చేస్తున్న పాదయాత్ర ప్రాముఖ్యతను కార్యకర్తలకు వివరించారు.

మరిన్ని వార్తలు