భవనం ఉన్నా.. విద్యార్థులకు ఉపయోగం సున్నా!
బోధన్, నవంబర్ 05 (విజయక్రాంతి): విద్యార్థుల సౌకర్యార్థం కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన భవనం అందుబాటులోకి రాకపోవడంతో నిరుపయోగంగా మారింది. నవీపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల బాలుర వసతి గృహం (Boys Hostel) నిర్మాణం పూర్తయినా ప్రారంభానికి నోచుకోవడం లేదు. దీంతో దూర ప్రాంతాల నుంచి కళాశాలకు వచ్చే పేద, మధ్యతరగతి విద్యార్థులు వసతి సౌకర్యం లేక ప్రైవేట్ హాస్టళ్లలో ఉంటూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్య అందించాలనే లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.6.50 కోట్ల వ్యయంతో నవీపేటలో పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేశారు. ఈ కళాశాలలో సివిల్, మెకానికల్ తదితర ఇంజినీరింగ్ కోర్సులు అందుబాటులో ఉండటంతో ఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. వివిధ గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు వసతి కల్పించాలనే ఉద్దేశంతో కళాశాల వెనుక భాగంలో సుమారు రూ.3.50 కోట్లతో ఆధునిక హంగులతో బాలుర హాస్టల్ భవనాన్ని (Hostel Building) నిర్మించారు.
అయితే నిర్మాణం పూర్తయినా ఇప్పటివరకు భవనాన్ని ప్రారంభించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురాకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన భవనం నిరుపయోగంగా ఉండగా, మరోవైపు విద్యార్థులు ప్రైవేట్ వసతి గృహాల్లో ఉండేందుకు అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. హాస్టల్ నిర్వహణ బాధ్యతలను విద్యార్థులకే అప్పగించే స్టూడెంట్ మేనేజ్మెంట్ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వమే నిర్వహణ బాధ్యతలు చేపట్టాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి విద్యార్థుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, హాస్టల్ భవనాన్ని వెంటనే ప్రారంభించి వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.
పాలిటెక్నిక్ బాలుర హాస్టల్ నిర్వహణకు సంబంధించి స్టూడెంట్ మేనేజ్మెంట్ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకోవాలని పీడీఎస్ఈయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి వచ్చి ప్రైవేట్ హాస్టళ్లలో ఉంటూ ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తోందన్నారు. కొంతకాలంగా నిరుపయోగంగా ఉన్న హాస్టల్‌ను ప్రారంభించడం ప్రభుత్వ బాధ్యతని, ఈ విషయంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు.
నవీపేట పాలిటెక్నిక్ కళాశాలలో బాలికల కోసం ప్రత్యేక హాస్టల్ ఏర్పాటు చేయాలని ఫైనల్ ఇయర్ విద్యార్థిని నిక్షిత కోరారు. బాలికల హాస్టల్ లేకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కళాశాల నుంచి తమ గ్రామాలకు వెళ్లే క్రమంలో సమీపంలోని ఇరిగేషన్ కాలువపై ఉన్న పైప్ మార్గం గుండా ప్రయాణించాల్సి వస్తోందని, ఈ క్రమంలో పలువురు గాయాలపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాలుర హాస్టల్ తరహాలోనే బాలికల కోసం కూడా ప్రత్యేక వసతి గృహాన్ని నిర్మించి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.