రామగుండం ఎమ్మెల్యే, సీఐ నియంతృత్వ పోకడలపై సమగ్ర విచారణ జరపాలి
- సీపీఐ నేతల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం
- మాజీ ఎమ్మెల్యే, సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్
గోదావరిఖని, నవంబర్ 05(విజయ క్రాంతి): రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో(Ramagundam industrial area) చిరు వ్యాపారుల దుకాణాల కూల్చివేతలు, సీపీఐ నాయకులపై పోలీసుల వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి సమగ్ర విచారణ(Chief Minister's Comprehensive Inquiry) చేపట్టాలని సీపీఐ జాతీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు.
గోదావరిఖనిలో సీపీఐ నాయకుల అరెస్టులు, పోలీసుల దురుసు ప్రవర్తనను ఆయన తీవ్రంగా ఖండించారు. అభివృద్ధి పేరుతో చిరు వ్యాపారుల దుకాణాలను కూల్చివేసి నెలలు గడుస్తున్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం దారుణమన్నారు. బాధిత వ్యాపారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దుకాణాల కూల్చివేతలకు నిరసనగా సీపీఐ నాయకులు చేపట్టిన ఆందోళన సందర్భంగా సీఐ ఇంద్రసేనారెడ్డి వ్యవహరించిన తీరు అభ్యంతరకరమని, కార్పొరేటర్ మార్కపురి సూర్యపై దాడి చేసి, చొక్కా చింపి అవమానించడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు. ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్, పోలీసుల వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి విచారణ జరిపించాలని కోరారు.
గతంలో షాపింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణం కోసం స్థల పరిశీలన చేసి, సింగరేణి జీఎం లలిత్ కుమార్ కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టిన ప్రాంతంలో ఇప్పుడు దుకాణాలను ఎందుకు కూల్చివేశారని ప్రశ్నించారు. సింగరేణి భూములకు సంబంధించి అవసరమైన అనుమతులు, మున్సిపల్ అనుమతులు పొందిన తర్వాతే నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.
కమ్యూనిస్టు నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తే సహించేది లేదని, ప్రజా సమస్యలపై పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీఐ తన వ్యవహారశైలిని మార్చుకోకపోతే సీపీఐ నుంచి ప్రతిఘటన తప్పదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, ఫ్లోర్ లీడర్ మార్కపురి సూర్య, జిల్లా సమితి సభ్యుడు శనగరపు చంద్రశేఖర్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఆరెపల్లి మానస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.