పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు.. 45 మంది అరెస్ట్
- దీపావళి సందర్భంగా వర్ని, చందూర్, మోస్రా మండలాల్లో ప్రత్యేక తనిఖీలు
- తొమ్మిది గ్రామాల్లో దాడులు.. 17 కేసులు నమోదు
- సోమవారం తెల్లవారుజాము వరకు కొనసాగిన పోలీసుల దాడులు
బోధన్,(విజయక్రాంతి): దీపావళి పండుగ(Diwali Festival) సందర్భంగా పేకాట స్థావరాలపై(Gambling Dens) వర్ని పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని వర్ని, చందూర్, మోస్రా మండలాల్లో పలు గ్రామాల్లో పేకాట స్థావరాలపై వరుస దాడులు నిర్వహించి 45 మందిని అరెస్టు చేసినట్లు ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. ఈ దాడుల్లో మొత్తం 17 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
శని, ఆదివారాలతో పాటు సోమవారం తెల్లవారుజాము వరకు పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కోకల్దాస్ తండా, శ్యామ్రావు తండా, జలాల్పూర్, జాకోరా, తగిలేపల్లి, తిమ్మాపూర్, గోవూర్, మోస్రా, లక్ష్మాపూర్ గ్రామాల్లో పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించారు.
పండుగల సమయంలో అసాంఘిక కార్యకలాపాలకు(Antisocial activities) పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై వంశీకృష్ణారెడ్డి హెచ్చరించారు. గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కార్యకలాపాలపై పోలీసుల నిఘా కొనసాగుతుందని, పేకాట, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.