వరుసగా మూడోసారి ఫైవ్‌స్టార్ రేటింగ్ సాధించిన ఆర్జీ-3 ఓసీపీ-1
సింగరేణి ఖ్యాతిని చాటిన కార్మికుల కృషి, నైపుణ్యం.. సంతోష సభలో జీఎం మధుసూదన్
రామగిరి,(విజయక్రాంతి) సింగరేణి సంస్థలోని ఆర్జీ-3 ఏరియా ఓపెన్ కాస్ట్ గని-1 వరుసగా మూడోసారి జాతీయస్థాయి ఫైవ్‌స్టార్ రేటింగ్ సాధించి రికార్డు సృష్టించిందని ఆర్జీ- 3 జీఎం మధుసూదన్ తెలిపారు. గని పనితీరు, భద్రతా ప్రమాణాలు, నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, కార్మిక సంక్షేమం తదితర అంశాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఈ ప్రతిష్టాత్మక గుర్తింపును దక్కించుకుంది.
కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఏటా అందించే స్టార్ రేటింగ్‌లో భాగంగా గని పనితీరు, రక్షణ చర్యలు, సౌకర్యాలు, పర్యావరణహిత చర్యలు, కార్మిక సంక్షేమం తదితర 84 అంశాలను పరిశీలించి మార్కులు కేటాయిస్తారు. కేంద్ర బొగ్గు శాఖ పరిశీలక బృందం క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి మూల్యాంకనం చేస్తుంది. 100 మార్కులకు 91కి పైగా మార్కులు సాధించిన గనులకు ఫైవ్‌స్టార్ రేటింగ్ అందజేస్తారు.
ఈ నెల 2న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌పూర్‌లో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో ఆర్జీ-3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్ కేంద్ర మంత్రి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. కోల్ ఇండియా, సింగరేణి సంస్థల ఉన్నతాధికారుల సమక్షంలో అవార్డు అందుకోవడం ఏరియాకు గర్వకారణంగా నిలిచింది.
సంతోష సభలో కార్మికులకు అభినందనలు
అవార్డు అందుకున్న షీల్డ్, ప్రశంసాపత్రాలను శనివారం గని ఆపరేషన్ సైట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్ మాట్లాడుతూ.. వరుసగా మూడోసారి ఫైవ్‌స్టార్ రేటింగ్ సాధించడం ఉద్యోగుల సమష్టి కృషి, నైపుణ్యం, అంకితభావానికి నిదర్శనమని అభినందించారు. భవిష్యత్తులోనూ గని రికార్డులను కాపాడుకుంటూ, భద్రతతో కూడిన ఉత్పాదకతను సాధించే దిశగా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గని ప్రాజెక్టు అధికారి ప్రవీణ్ వి. ఫాటింగ్, గని మేనేజర్ రావుల పాపయ్య, ఐఎన్టీయూసీ కేంద్ర కార్యదర్శి గడ్డం తిరుపతి యాదవ్, ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి ఎం.ఆర్.సి. రెడ్డి, అధికారుల సంఘం ప్రతినిధి, భద్రతాధికారి కోల శ్రీనివాస్ గౌడ్, ఏరియా అధికారులు మురళీకృష్ణ, ప్రాజెక్టు ఇంజనీర్ జ్ఞాన సంబంధన్, రక్షణ అధికారి అజయ్ కుమార్, సర్వే అధికారి రవీందర్, గని అధికారులు, పర్యవేక్షకులు, కార్మికులు పాల్గొని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంబరాలు జరుపుకున్నారు.