వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురి అరెస్ట్

07-11-2026 | 10:13pm

తాళం వేసిన ఇళ్లే టార్గెట్

10 చోరీ కేసులు ఛేదించిన ఇల్లందు పోలీసులు

రూ.27.51 లక్షల విలువైన బంగారం, వెండి స్వాధీనం

నిందితుల్లో ఇద్దరు పీజీ చదువుకున్నవారే

 కానిస్టేబుల్ రవికుమార్‌కు ఎస్పీ రివార్డు

ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): ఇల్లందు పట్టణంలో రాత్రి వేళల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.27.51 లక్షల విలువైన బంగారం, వెండితో పాటు ఒక ల్యాప్‌టాప్, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇల్లందు పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ ఈ కేసు వివరాలను వెల్లడించారు.

గత ఏడాది కాలంగా పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న నిందితులు ప్రధానంగా సింగరేణి క్వార్టర్స్, తాళాలు వేసి ఉన్న ఇళ్లు, సీసీ కెమెరాలు లేని ఇళ్లను లక్ష్యంగా చేసుకున్నారని తెలిపారు. జేకే కాలనీ, సుభాష్‌నగర్, ఆజాద్‌నగర్, వంగలరావు కాలనీ తదితర ప్రాంతాల్లో జరిగిన పది దొంగతనం కేసులను ఛేదించినట్లు పేర్కొన్నారు. నిందితుల్లో ఇద్దరు పీజీ చదువుకున్నవారని, విద్యావంతులైనప్పటికీ చెడు అలవాట్లకు లోనై దొంగతనాలకు పాల్పడుతున్నారని ఎస్పీ వివరించారు.

నిందితులను లోద్ విశాల్ కుమార్ (24), గౌతమ్ లోద్ (26), కోరి కళ్యాణ్ (20)గా గుర్తించినట్లు తెలిపారు. వీరిలో ఇద్దరు 15వ నంబర్ బస్తీకి, మరొకరు 14వ నంబర్ బస్తీకి చెందినవారిగా వెల్లడించారు. నిందితుల నుంచి 165 గ్రాముల బంగారం, 2 కిలోల 205 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ సుమారు రూ.27.51 లక్షలుగా అంచనా వేసినట్లు తెలిపారు. వీటితో పాటు ఒక ల్యాప్‌టాప్, మూడు సెల్‌ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

ఈ కేసుల ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన కానిస్టేబుల్ రవికుమార్‌ను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి నగదు రివార్డును అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ సమావేశంలో డీఎస్పీ వెంకన్నబాబు, సీఐ తాటిపాముల సురేష్ కుమార్, ఎస్సై తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు