రాష్ట్రానికి కేంద్ర నిధులు నామ్ కే వాస్తే!

20-11-2026 | 05:00am
  1. పదేండ్ల నుంచి క్రమంగా తగ్గుదల
  2. 23.5 నుంచి 15.1 శాతానికి డౌన్
  3. పన్నుల పంపిణీలోనూ కోతలు
  4. జీఎస్టీ పరిహారం నిలిపివేతతో అదనపు భారం
  5. సొంత ఆదాయ వనరులపైనే రాష్ట్రం ఆధారం
  6. సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ నివేదికలో వెల్లడి

హైదరాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న ఆర్థిక సహకారం క్రమంగా తగ్గుతూ వస్తున్నది. సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్(Center for Economic and Social Studies) తాజాగా విడుదల చేసిన అధ్యయన నివేదిక దీన్ని స్పష్టం చేస్తున్నది. కేంద్ర పన్నుల పంపిణీలో రాష్ట్రానికి అన్యా యం జరుగుతున్నదని, రాష్ట్ర ఆదాయ వనరులు పెరుగుతున్నప్పటికీ కేంద్రం నుంచి వచ్చే నిధుల వాటా తగ్గిపోతున్నదని రిపోర్ట్ పేర్కొంది.

గత పదేండ్లలో కేంద్ర నిధులపై రాష్ట్రం ఆధారపడే స్థాయి తగ్గిందని, అదే సమయంలో కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక బదిలీల వాటా కూడా గణనీయంగా పడిపోయిందని సీఈఎస్‌ఎస్ వెల్లడించింది. 2015 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ మొత్తం ఆదాయ రాబడుల్లో కేంద్రం నుంచి వచ్చే అప్పులు కాని నిధుల వాటా 23.5 శాతంగా ఉండేది. 2024 నాటికి అది 15.1 శాతానికి తగ్గింది. అంటే రాష్ట్ర ఆదాయంలో కేంద్రం నుంచి వచ్చే నిధుల ప్రాధా న్యం పదేండ్లలో 8.4 శాతం తగ్గింది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధులు అందే ప్రధాన మార్గాల్లో కేంద్ర పన్నుల వాటా ప్రధానమైనది. 14వ ఆర్థిక సంఘం కాలంలో కేంద్ర పన్నుల పంపిణీలో తెలంగాణకు 2.4 శాతం వాటా ఉండగా.. 15వ ఆర్థిక సంఘం కాలంలో అది 2.1 శాతానికి తగ్గింది. 

జీఎస్టీ పరిహారం నిలిపివేత..

కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పరిహారం నిలిపివేయడంతో తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతున్నది. జీఎస్టీ అమలుతో రాష్ట్రాలకు కలిగే ఆదాయ నష్టాలను భర్తీ చేసేందుకు కేంద్రం పరిహారం అందించింది. అయితే, పరిహార కాలం ముగియడంతో ఆ నిధులు నిలిచిపోయాయి. దీంతో కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ గణనీయంగా తగ్గింది. ఇప్పటికే కేంద్ర పన్నుల వాటా తగ్గుతున్న సమయంలో జీఎస్టీ పరిహారం నిలిచిపోవడం రాష్ట్ర ఆర్థిక వనరులపై అదనపు ఒత్తిడిని పెంచింది. ఒకవైపు రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే నిధులు తగ్గడం, మరోవైపు పెరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ అవసరాలను సొంత ఆదాయంతోనే నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడటం వంటి అంశాల మధ్య ఆర్థిక సమతుల్యత సాధించడం రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్‌గా మారుతున్నది. 

సొంత ఆదాయమే దిక్కు!

కేంద్రం నుంచి వచ్చే నిధుల వాటా తగ్గినప్పటికీ తెలంగాణ ఆర్థికంగా పూర్తిగా వెనుకబడలేదని సీఈఎస్‌ఎస్ గణాంకాలు సూచిస్తున్నాయి. గత పదేండ్లలో రాష్ట్ర మొత్తం ఆదాయ రాబడుల్లో 76 శాతం సొంత ఆదాయ వనరుల నుంచే సమకూరాయి. రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం ఏటా సగటున 11.6 శాతం వృద్ధి చెందింది. 2024 ఈ ఆదాయం రూ. 1,09,233 కోట్లకు చేరింది. రాష్ట్ర ఆదాయ వ్యవస్థలో సొంత వనరుల పాత్ర ఎంత కీలకంగా మారిందో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

అయితే సొంత ఆదాయం పెరుగుతున్నప్పటికీ కేంద్ర నిధుల తగ్గుదల ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రానికి వచ్చే సొంత ఆదాయంలో హెచ్చుతగ్గులు, సంక్షేమ పథకాల వ్యయం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, అప్పుల చెల్లింపులు వంటి బాధ్యతలను పరిగణనలోకి తీసుకుంటే కేంద్రం నుంచి వచ్చే నిధుల స్థిరత్వం కూడా అవసరమే అని సూచిస్తున్నారు. 

కేంద్రం సహకారం లేకపోతే కష్టమే!

సీఈఎస్‌ఎస్ తాజా నివేదిక గణాంకాలు ఆర్థిక సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలకు నిధుల పంపిణీ ఎంత సమతుల్యంగా జరుగుతున్నదనే అంశంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. రాష్ట్రాల అభివృద్ధి స్థాయి, ఆదాయ సామర్థ్యం, జనాభా నియంత్రణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకునే విధానంలో అభివృద్ధి సాధించిన రాష్ట్రాలకు ప్రతికూలత ఏర్పడకూడదన్న వాదనకు ఈ నివేదిక బలం చేకూరుస్తున్నది. తెలంగాణ వంటి యువ రాష్ట్రానికి అభివృద్ధి అవసరాలు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి.

హైదరాబాద్ కేంద్రంగా పెట్టుబడులు, పరిశ్రమలు, ఐటీ రంగం విస్తరిస్తున్నప్పటికీ ప్రాంతీయ అభివృద్ధి, సాగునీరు, విద్య, వైద్యం, పట్టణ మౌలిక సదుపాయాలపై భారీగా ఖర్చు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి పన్నుల వాటా, గ్రాంట్లు, ఇతర ఆర్థిక సహకారం తగ్గడం రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తమవుతున్నది. మరోవైపు సొంత ఆదాయాన్ని మరింత పెంచుకోవడం, పన్నుల వసూళ్ల సామర్థ్యాన్ని మెరుగుపరచడం, ఖర్చులకు ప్రాధాన్యత క్రమాన్ని నిర్ణయించడం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు