మృత్యుమార్గం..! హైదర్‌షా కోట్ బీటీ రోడ్డు..

04-11-2026 | 05:05am

పట్టించుకోని జీహెచ్‌ఎంసీ రాజేంద్రనగర్ సర్కిల్ అధికారులు

రాత్రి వేళల్లో పొంచి ఉన్న ప్రాణాపాయం

పెద్ద ప్రమాదం జరిగితేనే అధికారులు స్పందిస్తారా? అని వాహనదారుల ఆగ్రహం

రాజేంద్రనగర్, నవంబర్ 3 (విజయక్రాంతి): రాజేంద్రనగర్ నియోజకవర్గం(Rajendranagar Constituency) పరిధిలోని జీహెచ్‌ఎంసి 123 వ డివిజన్ హైదర్ షాకోట్  బీటీ రోడ్డు(Division Haider Shakot, BT Road) ప్రయాణికులకు నరకం చూపుతోంది. ప్రస్తుతం ఈ రహదారి అతి ప్రమాదకరంగా మారి వాహనదారుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ముఖ్యం గా ఆర్మీ స్కూల్ సమీపంలో ముందున్న బీటీ రోడ్డు పూర్తిగా ధ్వంసమై, రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

కల్వర్టు లేకపోవడమే శాపం..

గతంలో కురిసిన భారీ వర్షాలకు, వరద నీటి ఉధృతికి ఈ రోడ్డు పెద్ద ఎత్తున కోతకు గురైంది. రహదారికి అవతలి వైపు వరద నీరు సజావుగా సాగిపోయేందుకు ఎలాంటి కల్వర్టు నిర్మించకపోవడంతో, ప్రతిరోజూ కొంత మేర రోడ్డు కోతకు గురవుతూ వస్తోంది. ప్రస్తుతం రోడ్డు అంచున భారీ గోతి ఏర్పడటంతో ప్రయాణం కత్తిమీద సాములా మారింది.

బస్ స్టాప్ వద్దే ముప్పు..

రహదారి ధ్వంసమైన ప్రాంతానికి పక్కనే బస్ స్టాప్ ఉండటం పరిస్థితి తీవ్రతను మరింత పెంచుతోంది. బస్సుల కోసం ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో ప్రయాణికులు, విద్యార్థులు ఇక్కడే వేచి ఉంటారు. రోడ్డుపై వేగంగా వచ్చే వాహనాలు నియంత్రణ కోల్పోతే ప్రయాణికులపైకి దూసుకెళ్లే ప్రమాదం ఉందంటూ స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

చీకటి పడితే ‘చీకటి’ ప్రమాదాలు..

పగటి వేళల్లో ఎలాగోలా వాహనాలు నడుపుతున్నప్పటికీ, రాత్రి వేళల్లో ఈ రోడ్డుపై ప్రయాణించాలంటేనే వాహనదారులు వణికిపోతున్నారు. ఇక్కడ రోడ్డు భారీగా కోతకు గురైన విషయాన్ని గమనించని ద్విచక్ర వాహనదారులు, పాదాచారులు, కార్ల డ్రైవర్లు అదుపుతప్పి ప్రమాదాల బారిన పడుతున్నారు.

అధికారుల నిర్లక్ష్యంపై నిరసన..

జీహెచ్‌ఎంసి రాజేంద్రనగర్ సర్కిల్ అధికారులు గత కొన్ని నెలల నుంచి ఈ రోడ్డు దుస్థితిని కళ్లజూస్తున్నా, కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. ‘ఏదైనా పెద్ద ప్రమాదం జరిగి ప్రాణాలు పోతేనే తప్ప అధికారులు తమ నిర్లక్ష్యాన్ని వీడరా?‘ అంటూ స్థానికులు ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, హైదర్ షాకోట్ బీటీ రోడ్డుకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి, కల్వర్టు నిర్మించాలని ప్రయాణికులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు