రీసైక్లింగ్ ‘చెత్త’!

04-11-2026 | 05:40am

రాంకీ నిర్వాకం.. జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌లో(Jawaharnagar dump yard) ఎటుచూసినా కచరా గుట్టలే..

  1. రవాణా, రీసైక్లింగ్ కోసం రోజుకు రూ.2.2 కోట్లు తీసుకుంటున్న సంస్థ 
  2. రీసైక్లింగ్ జరగక పేరుకుపోయిన 3 కోట్ల టన్నుల చెత్త 
  3. కాలుష్యంతో స్థానికుల అరిగోస

* పేరుకే అది చెత్త.. కానీ, దాని నుంచి ఎంత పిండుకుంటే అంత డబ్బులు రాలుతాయనే సూత్రాన్ని వంటపట్టించుకున్నది రాంకీ సంస్థ! చెత్త రవాణా, రీసైక్లింగ్ కోసం ప్రభుత్వం (జీహెచ్‌ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ(GHMC, MMC, CMC)) నుంచి ప్రతిరోజూ ఆ సంస్థ అక్షరాలా రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు వసూలు చేస్తున్నది. కానీ, రీసైక్లింగ్ నిర్వహణ మాత్రం చెత్తగా ఉంటున్నది. జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌లో పేరుకుపోయిన చెత్త గుట్టలే ఇందుకు సాక్ష్యం.

ఫలితంగా జల, వాయు కాలుష్యంతో(Water and air pollution) నరకం అనుభవిస్తున్నామని యార్డ్ పరిసరాల్లోని జనం ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సుమారు  3 కోట్ల టన్నుల చెత్త యార్డ్‌లో పేరుకుపోయిందని, సరిగ్గా రీసైక్లింగ్ చేసి ఉంటే ఇంతలా చెత్త పేరుకుపోయేది కాదని జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ అంటున్నది. చుట్టుపక్కల సుమారు 40 లక్షల మంది ప్రజలు ఈ చెత్త గుట్టల నుంచి వచ్చే కాలుష్యం కారణంగా అనారోగ్యాల బారినపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నది. డంపింగ్ యార్డ్‌ను ఎత్తివేయాలని పోరాడుతున్నది. 

కాసుల దందా..

  1. ప్రతి రోజూ 10వేల టన్నుల చెత్త తరలింపు
  2. టన్నుకు రూ. 2,200 రాబడి 
  3. ఏడాదికి సుమారు రూ. 800 కోట్లకుపైగా చెల్లింపులు

నవంబర్ 3 (విజయక్రాంతి): తెలంగాణకు గుండెకాయలాంటి హైదరాబాద్ మహానగరం(Hyderabad Metropolitan City) (ఓఆర్‌ఆర్ పరిధి)లో ఉంటున్న సుమారు 1.75 కోట్ల మంది ప్రజల ఇండ్లు, కార్యాలయాలు, వ్యాపార కేంద్రాలు(Homes, offices, business centers), సంస్థలు, పరిశ్రమలు, కంపెనీల నుంచి ప్రతిరోజూ వస్తున్న చెత్తను రీసైక్లింగ్(Recycling) చేయడానికి జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌ను(Jawaharnagar dump yard) ఏర్పాటు చేశారు. ఇంటిగ్రేటెడ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్ట్ ఫర్ ది సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రాజెక్టులో భాగంగా దీన్ని నెలకొల్పారు. దశాబ్దంన్నర కాలం నుంచి చెత్తనంతా ఇక్కడికి తరలిస్తున్నారు.

అయితే, అనుకున్న స్థాయిలో చెత్త రీసైక్లింగ్ మాత్రం జరగడం లేదనేది డంపింగ్ యార్డ్‌లో చెత్త గుట్టలను చూస్తే అర్థమవుతున్నది. ప్రతిరోజూ ఈ మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో సుమారు 10 వేల టన్నుల చెత్త ఉత్పత్తి అవుతున్నట్టు.. రవాణా చేసి, రీసైక్లింగ్ చేస్తున్నట్టుగా అధికారిక గణాంకాలనుబట్టి తెలుస్తున్నది.

ఈ కార్పొరేషన్ల పరిధిలో నుంచి చెత్తను సేకరించే బాధ్యత కార్పొరేషన్లది. దాన్ని తరలించి(రవాణా), రీసైక్లింగ్ చేసే బాధ్యతలను రాంకీ ఎన్విరో ఇంజనీర్స్ లిమిటెడ్ సంస్థ చూస్తున్నది. ఈ రెండు పనులు చేస్తున్నందుకు గాను ఆ సంస్థకు జీహెచ్‌ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీలు ప్రతిరోజూ టన్ను చెత్తకు రూ. 2,200 చొప్పున చెల్లిస్తున్నాయి. 

రోజుకు రూ.2.2 కోట్లు తీసుకుంటూ..!

మూడు కార్పొరేషన్ల పరిధిలో రోజుకు 10వేల టన్నుల చెత్త ఉత్పత్తి అవుతున్నది. దాన్ని తరలించి, రీసైక్లింగ్ చేయడానికి రాంకీ సంస్థ టన్నుకు రూ. 2,200 చొప్పున మొత్తం రూ. 2.2 కోట్లు తీసుకుంటున్నది. ఈ లెక్కన చూసుకుంటే.. ప్రతి నెలా రూ. 66 కోట్లు.. సంవత్సరానికి సుమారు రూ. 800 కోట్లకుపైగా అందుకుంటున్నది. నిజానికి 2012లో రాంకీ సంస్థతో జీహెచ్‌ఎంసీ ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు.. టన్ను చెత్తకు రూ. 1,430 చొప్పున వసూలు చేసేది. ఒప్పందం ప్రకారం ఏటా సుమారు 5 శాతం మేర దీనిని పెంచుతూ పోవాలి.

ఈ లెక్కన ప్రస్తుతం టన్ను చెత్తకు రూ. 2,200 చొప్పున మూడు మున్సిపల్ కార్పొరేషన్లు చెల్లిస్తున్నాయి. అయితే పండుగల సమయంలో ప్రతిరోజూ 12 వేల టన్నుల వరకు చెత్త వస్తుందనే అంచనా ఉంది. అంటే దసరా, దీపావళి, సంక్రాంతి లాంటి పండుగల సమయంలో ప్రతిరోజూ 12 వేల టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. అలాంటి సందర్భాల్లో చెత్త రవాణా, రీసైక్లింగ్ కోసం మూడు కార్పొరేషన్లు చెల్లించేది మరింత ఎక్కువగా ఉంటుంది.

నిజానికి ప్రతిరోజూ సగటున 10 వేల టన్నుల చెత్తను జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌కు తరలిస్తున్నప్పటికీ.. అదే స్థాయిలో అక్కడ రీసైక్లింగ్ జరగడం లేదని పర్యావరణవేత్తలు, జేఏసీ ప్రతినిధులు, స్థానికులు అంటున్నారు. ప్రతిరోజూ 10 వేల టన్నుల చెత్తను తీసుకొస్తే.. రీసైక్లింగ్ మాత్రం కేవలం 2,000 టన్నుల నుంచి 2,500 టన్నుల వరకే చేస్తున్నారని చెప్తున్నారు. అందుకే రోజు రోజుకూ జవహర్‌నగర్ డంపింగ్‌యార్డ్‌లో చెత్త గుట్టలు భారీగా పేరుకుపోతున్నాయని అంటున్నారు. 

 350 ఎకరాల్లో 3 కోట్ల టన్నులకుపైగా చెత్త..

సుమారు దశాబ్దంన్నర కాలంగా జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌లో చెత్తను డంప్ చేస్తున్నారు. అయితే మొదట్లో 3 వేల టన్నుల నుంచి 5 వేల టన్నుల వరకు మాత్రమే చెత్త వచ్చేది. కానీ, కాలం గడుస్తున్నకొద్దీ హైదరాబాద్ పరిధిలో జనాభా పెరగడంతో ప్రతిరోజూ 10 వేల టన్నుల చెత్త ఉత్పత్తి అవుతున్నదని, ఈ మొత్తాన్ని రవాణా చేసినా.. రీసైక్లింగ్ చేయడం మాత్రం జరగడం లేదని స్థానికులు చెప్తున్నారు. నిజానికి రెండు విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు ఉన్నప్పటికీ.. అవికూడా నామమాత్రంగా పనిచేస్తున్నాయి.

తీసుకొచ్చిన చెత్తనంతా గుట్టలుగా పోసి యంత్రాలతో చదును చేస్తున్నారు. వీలైనంత వరకు మాత్రమే చెత్తను రీసైక్లింగ్ చేస్తున్నారు. అయితే మున్సిపల్ కార్పొరేషన్లు మాత్రం ప్రతి టన్నుకూ లెక్కగట్టి డబ్బులు చెల్లిస్తుండటం ఇక్కడ గమనార్హం. తీసుకొచ్చిన చెత్తను సరైన సైంటిఫిక్ పద్ధతిలో వేరు చేయడం, రీసైక్లింగ్ చేయడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనితో జవహర్‌నగర్ డంపింగ్‌యార్డ్‌లో ఉన్న మొత్తం 350 ఎకరాల స్థలం యావత్తూ.. చెత్తతో గుట్టలుగా మారిపోయింది.

ఇక్కడ ప్రస్తుతం దాదాపు 3 కోట్ల టన్నుల చెత్త గుట్టలు పేరుకుపోయినట్టు  జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ చైర్మన్ షేక్ షావలి అన్నారు. చుట్టుపక్కల సుమారు 40 లక్షల మంది ప్రజలు ఈ చెత్త గుట్టల నుంచి వచ్చే కాలుష్యం కారణంగా అనారోగ్యాల బారినపడుతున్నారని ఆయన వాపోయారు. మొత్తానికి మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి ప్రతిరోజూ సగటున 10 వేల టన్నులకు డబ్బులు వసూలు చేసుకుంటున్న రాంకీ సంస్థ మాత్రం అదే స్థాయిలో చెత్తను వేరుచేసి, రీసైక్లింగ్ చేయడం లేదనే విమర్శలు తీవ్ర స్థాయిలో వస్తున్నాయి.  

రీసైక్లింగ్ చేయడం లేదు.. 

ప్రతిరోజూ జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌కు తీసుకొచ్చే చెత్తను రీసైక్లింగ్ చేయడానికి రాంకీ సంస్థతో ప్రభుత్వం (మున్సిపల్ కార్పొరేషన్లు) ఒప్పందం కుదుర్చుకుంది.  ప్రస్తుతం రోజుకు సుమారు 10 వేల టన్నుల చెత్తను తీసుకొస్తున్నట్టు సమాచారం. ఆ స్థాయిలో తీసుకొచ్చిన చెత్తను అదే స్థాయిలో సెగ్రిగేట్ చేసి, సైంటిఫిక్ పద్ధతుల్లో దానిని శుద్ధి చేసి, రీసైక్లింగ్ చేయాలి. కానీ, రాంకీ సంస్థ అలా చేయడం లేదు. తీసుకొచ్చినట్టు చెప్తున్న చెత్తకు మాత్రం ప్రభుత్వం నుంచి చెల్లింపులు జరుగుతున్నాయి.

అంటే పని చేయకుండానే ప్రభుత్వం నుంచి ఆ సంస్థకు రీసైక్లింగ్ కోసం డబ్బులు వెళ్తున్నాయి. ఇలా ఏటా కోట్లాది రూపాయల ప్రజల సొమ్మును ప్రైవేటు సంస్థకు కట్టబెట్టడం ఏమిటి? కాలుష్యాన్ని మాత్రం మేం అనుభవిస్తున్నాం. సరిగ్గా సైంటిఫిక్ పద్ధతుల్లో రీసైక్లింగ్ చేయకపోవడంతో.. చుట్టుపక్కల ఉన్న సుమారు 25 నుంచి 30 గ్రామాల ప్రజలు జల, వాయు, భూ కాలుష్యంతో తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తున్నారు. ఇక్కడి నుంచి డంపింగ్ యార్డ్‌ను ఎత్తివేయాలని ప్రత్యక్షంగా పోరాటం కూడా దమ్మాయిగూడ జేఏసీ తరఫున చేస్తున్నాం.

 మారం సమ్మిరెడ్డి, 

కో కన్వీనర్, దమ్మాయిగూడ జేఏసీ

డంపింగ్ యార్డ్‌ను ఎత్తివేయాలి 

రోజూ 10 వేల టన్నుల చెత్తను తీసుకొచ్చి ఇక్కడ పోస్తున్నారు. చెత్త రవాణా, రీసైక్లింగ్‌కు టన్నుకు రూ. 2,220 చొప్పున ప్రభుత్వం రాంకీ సంస్థకు చెల్లిస్తున్నది. అంత డబ్బులు చెల్లిస్తుంటే.. సరిగ్గా వాటిని రీసైక్లింగ్ చేస్తే ఈ కాలుష్యం ఉండకూడదు.. చెత్త గుట్టలు ఉండకూడదు. కానీ అలా చేయకుండా.. గుట్టలుగా పోస్తున్నారు. అంటే డబ్బులు మాత్రం ప్రభుత్వం నుంచి తీసుకుంటున్నారు. సుమారు 3 కోట్ల టన్నుల చెత్త ఇక్కడ పేరుకుపోయింది. సరిగ్గా రీసైక్లింగ్ చేసి ఉంటే.. ఇంతలా చెత్త పేరుకుపోదు కదా.

చుట్టుపక్కల సుమారు 40 లక్షల మంది ప్రజలు ఈ చెత్త గుట్టల నుంచి వచ్చే కాలుష్యం కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. క్యాన్సర్ సహా అనేక రోగాలబారినపడుత్నురు. గాలి, నీరు, భూమి మొత్తం కాలుష్యానికి గురవ్వడంతో.. మరో 50 సంవత్సరాల వరకు ఈ చుట్టుపక్కల ప్రజలు ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఇక్కడ డంపింగ్ యార్డ్‌ను ఎత్తివేయాలి. ఇక్కడి ప్రజలను, వారి ఆరోగ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

 షేక్ షావలి, చైర్మన్, 

జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ 

మరిన్ని వార్తలు